జయలలిత-శశికళ వేరు వేరు కాదు.. ఇద్దరూ ఒక్కటే..! ఎన్నో ఏళ్లుగా అత్యంత సన్నిహితులుగా వీరిద్దరూ మెలిగారు. అమ్మ మెచ్చిన నెచ్చెలిగా శశికళ జయలలిత చివరి నిమిషం వరకూ వెన్నంటే నిలిచింది. ‘అమ్మ’ మరణించిన తర్వాత అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆ తర్వాత శశికళ జైలు పాలవ్వడం.. జైలుకు వెళ్లే ముందు జయలలిత సమాధి మీద మూడు సార్లు కొట్టడం.. అప్పట్లో హాట్ టాపిక్ గా నిలిచాయి. అందుకే జయలలిత మీద బయోపిక్ తీసినా.. అందులో శశికళ క్యారెక్టర్ కు చాలా ప్రాముఖ్యత ఉంటుంది.

ప్రస్తుతం జయలలిత బయోపిక్ లు గా చాలా సినిమాలే రూపొందుతూ ఉన్నాయి. వెబ్ సిరీస్ కూడా రెడీ అవుతోంది. ముఖ్యంగా ‘తలైవి’ సినిమా మీద హైప్ ఉన్న సంగతి తెలిసిందే. కంగనా రనౌత్ జయలలితగా నటిస్తున్న ఈ సినిమా టీజర్ ఇటీవలనే బయటకు వచ్చింది. రాజకీయాల్లోకి వచ్చాక జయలలిత లుక్ విషయంలో భారీగా విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఈ సినిమా నుండి మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది.

కంగన నటిస్తున్న తలైవిలో శశికళ పాత్రకు జాతీయ ఉత్తమనటి ప్రియమణిని ఎంచుకున్నారు మూవీ మేకర్స్. దర్శకుడు ఏ.ఎల్.విజయ్ శశికళ పాత్రకు ప్రియమణి తప్ప ఇంకెవరూ న్యాయం చేయరని భావించినట్లు తెలుస్తోంది. శశికళ క్యారెక్టర్ ఎలా చూపించబోతున్నారా అని కూడా అందరి మెదళ్లలో ఓ డౌట్ ఉంది. శశికళ ‘అమ్మ’ కు వెన్నుపోటు పొడిచిందంటూ పలువురు ఆరోపణలు గుప్పించారు. జయలలిత కోలుకుంటారు అని ఆశించిన తరుణంలో శశికళ మాస్టర్ ప్లాన్ వేసి.. అంతమొందించిందంటూ సంచలన ఆరోపణలు చేశారు కొందరు. ఇంతకూ ఈ సినిమాలో ప్రియమణి ఎన్ని షేడ్స్ లో కనిపిస్తుందో రిలీజ్ అయ్యే వరకూ ఎదురుచూడాలి. అంతేకాకుండా మన్నార్ గుడి మాఫియా గురించి కూడా ఏమైనా సినిమాలో చూపిస్తారో లేదో..!