producer suresh babu announces two new movies with alumni of the ramanaidu film school

ప్రముఖ నిర్మాత సురేష్ ప్రొడక్షన్స్ అధినేత దగ్గుబాటి సురేష్ బాబు మంచి కంటెంట్ ఉన్న సినిమాలను నిర్మిస్తారనే విషయం తెలిసిందే. రామానాయుడు ఫిల్మ్ స్కూల్‌ పూర్వ విద్యార్థులతో నిర్మాత సురేష్ బాబు సినిమాలు తీస్తున్నారు. ఈ మేరకు ఆయన రెండు కొత్త చిత్రాలను గురువారం ప్రకటించారు.

ఈ రెండు సినిమాలకు దర్శకత్వం వహించే డైరెక్టర్లు రామానాయుడు ఫిల్మ్ స్కూల్ పూర్వ విద్యార్థులు కావడం విశేషం. సతీష్ త్రిపుర, అశ్విన్ గంగరాజు దర్శకత్వంలో ఈ రెండు సినిమాలు చేస్తున్నారు. ఒక ఉత్కంఠ భరితమైన క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ మరియు ఒక ప్రముఖ వ్యాపారవేత్త హత్య చుట్టూ అల్లుకున్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ లను సురేష్ బాబు నిర్మించనున్నారు. రామానాయుడు ఫిల్మ్ స్కూల్ పూర్వ విద్యార్థులను తెలుగు చిత్ర పరిశ్రమలోనికి తీసుకురావటంలో ఇదో మైలు రాయిగా అభివర్ణించవచ్చని ఇండస్ట్రీ వర్గాల్లో చెప్పుకుంటున్నారు.

ఆయా చిత్రాల నటీనటులు, టెక్నీషియన్ల వివరాలను త్వరలో వెల్లడిస్తారు. ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ.. ‘మా ఫిలిం స్కూల్ విద్యార్థులను కొన్నేళ్లుగా సినీరంగంలో వచ్చే మార్పులకు సవాళ్లకు టెక్నాలజీకి మరియు పోటీకి తగ్గట్టుగా మలచటంలో మేము సక్సెస్ అయ్యాము” అని తెలిపారు. ఒకప్పుడు భారీ చిత్రాలకు కేరాఫ్ అయిన సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ఇప్పుడు ప్రతిభావంతులైన దర్శకులతో చిన్న చిత్రాలు చేస్తూ ప్రోత్సహిస్తోంది. అలాగే, ప్రేక్షకులకు నచ్చే వినోదాత్మకమైన కమర్షియల్ సినిమాలను సైతం అందిస్తోంది.