Vakeel Saab motion poster on next Wednesday

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ‘వకీల్ సాబ్’ సినిమాతో బిజీగా ఉన్నారు. ‘వకీల్ సాబ్’ చిత్రం ఈపాటికే థియేటర్లలోకి రావాల్సింది. కాకపోతే లాక్‌డౌన్ కారణంగా తాత్కాలికంగా వాయిదా పడింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్, పాట విడుదలయ్యాయి. వీటికి అభిమానుల నుంచే కాకుండా సినీ ప్రేమికుల నుంచి విశేష స్పందన వచ్చింది. వీటి తరవాత అప్‌డేట్ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సెప్టెంబరు 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర బృందం మోషన్ పోస్టర్‌ను ఆవిష్కరించడానికి సన్నాహాలు చేస్తోందని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఎంతో కాలంగా పవర్ స్టార్ ఫ్యాన్స్ వకీల్ సాబ్ టీజర్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుండటంతో ఈ మోషన్ పోస్టర్‌ని వారి అంచనాలకు తగినట్టుగా టీజర్‌ ట్రీట్‌కి సమానంగా ఉండేలా డిజైన్ చేస్తున్నట్టు సమాచారం. మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. థమన్ కూడా తన ట్విట్ట్వర్‌లో “WED-NES-DAY” అని ట్వీట్ చేసి అభిమానులకు హింట్ ఇచ్చాడు.

ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్ అయిన ‘పింక్’ చిత్రానికి రీమేక్ అనే సంగతి తెలిసిందే. ఈ లీగల్ డ్రామాలో పవన్ కళ్యాణ్ న్యాయవాది పాత్ర పోషిస్తున్నాడు.