‘గాలి సంపత్’ సుడిగాలి వేగం.. షూటింగ్ 80 శాతం కంప్లీట్‌

320
Rajendra Prasad, Sree Vishnu Starrer Gaali Sampath Completes 80 Percent Shoot In First Schedule

బ్లాక్ బ‌స్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి సమర్పిస్తూ, స్క్రీన్ ప్లే అందిస్తున్న చిత్రం ‘గాలి సంప‌త్’. అనిల్ వద్ద కో-డైరెక్టర్‌గా, రచయితగా పనిచేసిన ఆయన మిత్రుడు ఎస్. క్రిష్ణ ఇమేజ్ స్పార్క్‌ ఎంటర్‌టైన్మెంట్ అనే బ్యానర్‌ను స్థాపించి షైన్ స్క్రీన్స్ సంస్థతో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శ్రీవిష్ణు, ల‌వ్‌లీ సింగ్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. న‌ట‌కిరీటి డాక్టర్ రాజేంద్ర ‌ప్రసాద్ గాలి సంప‌త్‌గా టైటిల్ రోల్ పోషిస్తున్నారు. ఈ చిత్రానికి అనీష్ ద‌ర్శక‌త్వం వహిస్తున్నారు.

ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ గత నెలలోనే అరుకులో ప్రారంభమైంది. సుమారు 25 రోజులపాటు అరుకు, విశాఖపట్నంలో సుడిగాలి వేగంగా షూటింగ్ చేసి తొలి షెడ్యూల్‌ను తాజాగా పూర్తి చేశారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థలు ప్రకటించారు. అంతేకాదు, ఈ తొలి షెడ్యూల్‌లో ఏకంగా 80 శాతం చిత్రీకరణను పూర్తి చేయడం విశేషం. రాజేంద్ర ప్రసాద్.. హీరో శ్రీ విష్ణుతో పాటు సినిమాలో ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. అనంతరం విశాఖ షెడ్యూల్ ని కంటిన్యూ చేశారు…

ఈ అందమైన అనుభవాన్ని షేర్ చేసుకోకుండా ఆగలేం! అంటూ ఫన్నీ నోట్ తో టీమ్ ఆనందం వ్యక్తం చేసింది. తదుపరి హైదరాబాద్ షెడ్యూల్ ఉంటుందని సమాచారం. వీలైనంత త్వరగా ఈ రెండో షెడ్యూల్‌ను కూడా పూర్తిచేసి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు దర్శక నిర్మాతలు. కాగా, ఈ చిత్రంలో ఇంకా త‌నికెళ్ల భ‌ర‌ణి, స‌త్య, ర‌ఘుబాబు, శ్రీ‌కాంత్ అయ్యంగార్‌, మిర్చి కిర‌ణ్‌, సురేంద్ర రెడ్డి, గ‌గ‌న్‌, మీమ్స్ మ‌ధు, అనీష్ కురువిల్లా, ర‌జిత‌, క‌రాటే క‌ళ్యాణి, సాయి శ్రీ‌నివాస్‌, రూపల‌క్ష్మి నటిస్తున్నారు.