రామ్ గోపాల్ వర్మ.. అంటేనే సంచలనాలు, వివాదాలు..! ఈ వారం విడుదల కావడానికి ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ ముహూర్తమైతే కుదుర్చుకుంది కానీ.. సెన్సార్ సమస్యలు ఓ వైపు వెంటాడుతూ ఉంటే.. ఇక కేసుల్లో ఏమని తీర్పులు వస్తాయో చూడాలి. సాధారణంగా వర్మ సినిమాలకు పెద్దగా ప్రమోషన్లు అవసరం లేదు.. కానీ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మరీ పలు డౌట్ లను క్లారిఫై చేయాలని ప్రయత్నించాడు.

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణస్వీకారోత్సవం చూసినప్పుడు ఈ సినిమా ఐడియా వచ్చిందని.. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు ఓ మెసేజ్‌ ఓరియంటెడ్ సినిమా అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు. ఈ సినిమాలో ఏ వర్గాన్ని తక్కువగా చేసి చూపించటం లేదనీ.. కేవలం కొన్ని సంఘటనల ఆధారంగా కథ రెడీ చేసుకున్నానన్నారు. తాను ఎవరినీ టార్గెట్‌ చేసి సినిమా చేయనని కేవలం తనకు ఇంట్రస్టింగ్‌గా అనిపించిన పాయింట్‌ను మాత్రమే సినిమాగా తెరకెక్కిస్తానని అన్నాడు. క్రైమ్‌ కన్నా.. పొలిటికల్‌ క్రైమ్‌ మరింత ఇంట్రస్టింగ్‌గా ఉంటుందని చెప్పుకొచ్చాడు. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు ఓ కామెడీ ఎంటర్‌టైనర్‌ అని కూడా అన్నాడు వర్మ. ఈ సినిమాను ఓ ప్రముఖ తండ్రి కొడుకులకు అంకిత ఇవ్వనున్నానన్నాడు. అయితే వారి పేర్లు మాత్రం అడగవద్దన్నాడు. తనకు చిన్నప్పటి నుంచి గిల్లటం అంటే ఇష్టమని.. ఎవరైనా పొగిడితే నిద్రొచ్చేస్తుందని.. బాగా తిట్టించుకోవటం తనకు ఇష్టమని.. అందుకే ఇలాంటి సినిమాలు చేస్తున్నానన్నాడు.

సినిమా పొలిటికల్ సెటైర్ లతో ఒక మంచి భోజనంలా ఉంటుందని అందులో పప్పు కూడా ఉంటుందని అన్నాడు. మాజీ ముఖ్యమంత్రిని పోలిన వ్యక్తిని సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ వీడియో ద్వారా పట్టుకున్నామని.. అతనికి ఒక నెల.. నెలన్నర పాటూ ట్రైనింగ్ ఇచ్చామని అన్నాడు. ట్రైలర్ లో చూపించిన వన్నీ సినిమాలో ఖచ్చితంగా ఉంటాయని.. ఈ శుక్రవారం సినిమా రిలీజ్ తప్పకుండా ఉంటుందని తన ప్రెస్ మీట్ ను ముగించాడు.