మెగా కోడలు ఉపాసన ప్రారంభించిన యువర్ లైఫ్ గురించి తెలిసిందే కదా. మొన్నటిదాకా సమంత గెస్ట్ ఎడిటర్ గా ఉండి తనదైన స్టయిల్ తో అలరించింది. ఆమె స్థానాన్ని భర్తీ చేయడానికి రష్మిక మందన గెస్ట్ ఎడిటర్‌గా ఉంటూ పలు రకాల పోషకాహార వంటలను పరిచయం చేస్తున్నారు. ‘రీచార్జ్ యువర్ లైఫ్ విత్ రష్మిక’ పేరుతో ఉపాసనతో కలిసి వీడియోలు చేస్తున్నారు. మరి ఈ గెస్ట్ ఎడిటర్ ఏమేం చేసిందన్న ఆసక్తి సహజమే కదా. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తాను ఏం ఫాలో అవుతున్నానో ఆడియన్స్‌కు చెబుతూ, ఆరోగ్యకరమైన వంటకాలను వండుతూ తన స్టైల్లో ఎంటర్టైన్ చేస్తున్నారు రష్మిక.
అలాంటి రెసిపీలలో పుట్టు చికెన్ కూర ఒకటి. తాజా చికెన్ తో కోలీ పుట్టు కూర వండటమే కాదు ఉపాసనకు దాని రుచి కూడా చూపించింది. మరి ఆ వంటకానికి మార్కులు వేయాలి కదా.. అందుకే ఉపాసన వందకు వంద మార్కులు ఇచ్చేసింది. రష్మికకు ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి మంచి వంట చేసే భార్య కోసం ఎవరైనా చూస్తుంటే రష్మిక మంచి ఆప్షన్ అని ఫన్నీగా ప్రశంసించారు ఉపాసన. ఇదిలా ఉంటే ఈ వీడియోలో రష్మిక మందన తన సామాజిక వర్గం గురించి ప్రస్తావించారు. తాను కోర్గి (కొడవ) సామాజిక వర్గానికి చెందిన అమ్మాయినని రష్మిక చెప్పారు.
కాగా, రష్మిక స్వస్థలం కర్ణాటకలోని కొడగు జిల్లాలో ఉన్న విరాజ్పేట్ పట్టణం. కొడగు జిల్లాలో కోర్గి వర్గానికి చెందిన ప్రజలు ఎక్కువగా జీవిస్తుంటారు. కేరళ, కర్ణాటక సరిహద్దు పశ్చిమ కనుమల్లో కొడగు జిల్లా వ్యాపించి ఉంది. ఇక్కడి కోర్గి ప్రజలకు ప్రత్యేకమైన సంస్కృతి, సంప్రదాయాలు ఉన్నాయి. రష్మిక, ఉపాసన సరదా సంభాషణలో ఉన్న వీడియో ఇప్పుడు నెట్ లో వైరల్ అవుతోంది.