Comedian Venu Madhav is no more
Comedian Venu Madhav is no more

ప్రముఖ హాస్య నటుడు వేణు మాధవ్ కొద్దిరోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు కన్నుమూశారు. ఆయన మరణం పట్ల తెలుగు చిత్ర సీమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ఆయనతో కలిసి పనిచేసిన ప్రముఖులు చాలామంది ఆనాటి జ్ఞాపకాలను తలచుకుని సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

అనుష్క పోస్ట్ చేస్తూ.. ”వేణు మాధవ్‌ గారి మ‌ర‌ణవార్త గురించి తెలియగానే నాకు చాలా బాధ కలిగింది. ఆయనతో నాకు నా ఫస్ట్ మూవీ ‘సూపర్‌’ నుండే మంచి పరిచయం ఉంది. మేం కలిసి నటించాం. ఆయనతో నాకు మంచి జ్ఞాపకాలు ఉన్నాయి. తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకమైన టాలెంట్ ను కలిగిన బెస్ట్ కమెడియన్స్ లో వేణు మాధవ్ గారు ఒకరు. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’ అని అనుష్క పోస్ట్ చేశారు.

అలాగే మెగాస్టార్ చిరంజీవి వేణుమాధ‌వ్ మృతి పై స్పందిస్తూ.. ‘ వేణుమాధ‌వ్ తొలిసారి నాతో క‌లిసి మాస్ట‌ర్ సినిమాలో న‌టించాడు. అటు పై ప‌లు సినిమాల్లో న‌టించి హాస్య‌న‌టుడిగా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ద‌క్కించుకున్నాడు. కొన్ని పాత్ర‌లు త‌న‌కోసమే పుట్టాయ‌న్నంతగా న‌టించేవాడు. ఆ పాత్ర‌కే వ‌న్నెతీసుకొచ్చే వాడు. వ‌య‌సులో చిన్న‌వాడు. సినీ ప‌రిశ్ర‌మ‌లో త‌న‌కింకా బోలెడంత భ‌విష్య‌త్ ఉంద‌ని అనుకునే వాడిని. కానీ దేవుడు చిన్న చూపు చూశాడు. ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూర‌ల‌ని ఆ దేవుడ్ని ప్రార్ధిస్తున్నాను’ అన్నారు.

నల్గొండ జిల్లా కోదాడలో జన్మించిన వేణు మాధవ్ 1996లో కృష్ణ హీరోగా దర్శకుడు ఎస్ వి కృష్ణారెడ్డి తెరకెక్కించిన సంప్రదాయం సినిమాతో తెలుగు తెరకు పరిచయ్యారు. విలక్షణ నటన, తెలంగాణా మాండలికంలో ఆయన చెప్పే డైలాగ్స్ కారణంగా అనతి కాలంలోనే టాప్ కమెడియన్ గా ఎదిగారు. తొలిప్రేమ సినిమాలో అమ్మాయిల పై ఆయన చెప్పిన చాటభారతమంత డైలాగ్ ఆయన్ను ప్రేక్షకులకు బాగా చేరువ చేసింది. ఆ తరువాత దిల్ సినిమాతోనూ ఆయనకు మంచి పేరు వచ్చింది. లక్ష్మి సినిమాతో ఉత్తమ హాస్యనటుడిగా నంది అవార్డును అందుకున్నారు.