వృద్ధాశ్రమాన్ని ప్రారంభించిన సుప్రీమ్‌ హీరో సాయితేజ్

386
sai dharam tej open Amma Prema Adaran Seva Samithi old age home at vijayawada

మాట ఇవ్వడం అందరూ చేస్తారు. కానీ ఇచ్చిన మాటలను నిలబెట్టుకునేవారు కొందరే. ఆ కొందరిలో నేను సైతం అని అంటున్నారు సుప్రీమ్‌ హీరో సాయితేజ్‌. ఈ యువ కథనాయకుడు గురువారం విజయవాడలో సందడి చేశారు. వాంబే కాలనీలోని ‘అమ్మ ప్రేమ ఆదరణ’ వృద్ధాశ్రమంను ఆయన ప్రారంభించారు. అలాగే ఆ వృద్ధాశ్రమంలో ఏర్పాటుచేసిన ఆశ్రమ ఫౌండర్‌ నారాయణ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆశ్రమంలోని వృద్ధులతో కాసేపు ముచ్చటించారు.

గత ఏడాది సెప్టెంబర్‌లో అమ్మ ప్రేమ ఆదరణ వృద్ధాశ్రమం నిర్మాణ దశలో ఉందని, ఆ భవనాన్ని పూర్తి చేయడానికి సహకరించాలని కోరుతూ సాయితేజ్‌ను అమ్మప్రేమఆదరణ సేవాసమితి సంప్రదించింది. ఆ భవనాన్ని పూర్తి చేయడమే కాకుండా ఏడాది పాటు ఆశ్రమం బాగోగులను చూసుకుంటానని అప్పడు సాయితేజ్‌ మాట ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మెగాభిమానులు కూడా భాగం కావాలని సాయితేజ్‌ కోరారు. తన పుట్టినరోజుకి కటౌట్స్‌ పెట్టడం, బ్యానర్స్‌ ఏర్పాటు చేయకుండా ఆ డబ్బును అమ్మప్రేమ ఆదరణ వృద్ధాశ్రమ భవన నిర్మాణానికి విరాళంగా ఇవ్వాలని రిక్వెస్ట్‌ చేశారు. అభిమాన హీరో అలా అడగడంతో మెగాభిమానులు కాదనలేకపోయారు. అందరూ భవన నిర్మాణానికి తమ వంతుగా లక్ష రూపాయల విరాళాన్ని అందించారు.

మెగాభిమానులు ఇచ్చిన అభిమానానికి తన వంతుగా సాయితేజ్‌ కూడా ముందుకు వచ్చి భవన నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఏడాది పాటు అమ్మ ప్రేమ ఆదరణ వృద్ధాశ్రమానికి కావాల్సిన మౌలిక సదుపాయాల ఖర్చుని కూడా సాయితేజ్‌ సమకూర్చారు. ఆ సమయంలో అమ్మప్రేమఆదరణ సేవాసమితి సభ్యులు విజయవాడకు రావాలని సాయితేజ్‌కు కోరగా.. సమయం వచ్చినప్పుడు తప్పకుండా వస్తానని అన్నారు. అన్నమాట ప్రకారం గురువారం అమ్మప్రేమఆదరణ ఆశ్రమాన్ని సందర్శించారు. షూటింగ్ నిమిత్తం విజయవాడ వచ్చిన సాయి ధరమ్ తేజ్.. వృద్ధాశ్రమంను సందర్శించడంతో ఆ ప్రాంతమంతా మెగా అభిమానులతో నిండిపోయింది. అందరి సహకారంతో మున్ముందు మరిన్ని సహాయ కార్యక్రమాలు చేపడతానని చెప్పారు.