సినిమా ప్రమోషనల్ ఈవెంట్స్ అంటే హీరో హీరోయిన్లు పలు ప్రాంతాలకు వెళ్లడం.. అక్కడ సందడి చేయడం సర్వ సాధారణం. కొన్ని కొన్ని సార్లు అలాంటి ఈవెంట్లకు వెళ్ళినప్పుడు చిన్న తప్పు జరిగినా సెలెబ్రిటీలు ఇబ్బంది పడాల్సి ఉంటుంది. గతంలో ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి.. కొందరు అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించి హీరోయిన్లను తాకరాని చోట్ల తాకడాలు.. హీరోలను పట్టుకొని లాగడాలు చాలానే జరిగాయి. అందుకే బౌన్సర్లు, సెక్యూరిటీ అంటూ చాలా జాగ్రత్తగా ఈవెంట్లను ప్లాన్ చేయాల్సి ఉంటుంది. చిన్న ఏమరుపాటు ప్రదర్శించినా పెద్ద సమస్యలే తలెత్తుతాయి. అభిమానులనైనా ఎలాగోలా కంట్రోల్ చేయొచ్చు.. అదే ఆకతాయిలను కంట్రోల్ చేయాలంటే మాత్రం.. చాలా కష్టం. తాజాగా హీరోయిన్ రాశీఖన్నా, హీరో సాయి ధరమ్ తేజ్ లకు అలాంటి పరిస్థితే ఎదురయింది.
‘ప్రతిరోజూ పండుగే’ చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్లో భాగంగా సాయి ధరమ్ తేజ్, రాశీ ఖన్నాలు ఆదివారం గుంటూరుకు వెళ్లారు. వీరిద్దరూ గుంటూరు భాస్కర్ థియేటర్‌కు వెళ్లారు. కాస్త జాగ్రత్త పడ్డ చిత్ర యూనిట్ పెద్ద సంఖ్యలో బౌన్సర్లను తోసుకొచ్చారు. ఊహించిన దానికంటే అభిమానులు వచ్చారు. అలాగే కొందరు ఆకతాయిలు కూడా అక్కడకు వచ్చేసారు. బౌన్సర్లను దాటుకొని హీరో హీరోయిన్ల దగ్గరకు వచ్చేందుకు ప్రయత్నించారు. సాయిధరమ్ తేజ్ మైకు తీసుకోగా ఆకతాయిలు అల్లరి చేయడం మొదలెట్టారు.. దూసుకొని రావడానికి ప్రయత్నించారు. దీంతో పరిస్థితి చేయి దాటిపోతోందని భావించి హీరో హీరోయిన్లు థియేటర్ పై అంతస్తుకు వెళ్లిపోయారు. నిర్వాహకులు, అభిమానుల మధ్య తోపులాట జరిగింది. ఇక కాసేపయ్యాక కొంత వరకు పరిస్థితిలో మార్పు రాగానే అంధ విద్యార్థులకు చెక్కుల పంపిణీ చేశారు సాయి ధరమ్ తేజ్, రాశీ ఖన్నా.
ఇక రాశీఖన్నా హీరోయిన్ గా చేసిన రెండు సినిమాలు వారం గ్యాప్ లో రాబోతుండడంతో అమ్మడు ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉంది. ‘వెంకీమామ’, ‘ప్రతిరోజూ పండగే’ సినిమాల మధ్య గ్యాప్ వారం మాత్రమే ఉంది. వెంకీమామ 13 వ తారీఖున రిలీజ్ అవుతుండగా, ‘ప్రతిరోజూ పండగే’ 20 వ తేదీన విడుదలవుతోంది. ఈ రెండు ట్రైలర్లకు మంచి స్పందన వచ్చింది. సినిమాలు హిట్ అవ్వడం మాత్రమే బాకీ ఉంది.