Sai Dharam Tej Responds to Abdul Farhan Commentsమెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఆ బైక్ యాక్సిడెంట్ లో తీవ్రంగా గాయపడిన తేజ్ ను సయ్యద్ అబ్దుల్ ఫర్హాన్ అనే వ్యక్తి హాస్పిటల్ లో చేర్పించాడు. తన ప్రాణాలు కాపాడిన ఫర్హాన్ కు సాయి తేజ్ సాయం చేశాడంటూ ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే వాటిల్లో ఎలాంటి నిజం లేదని తాజాగా తేజ్ క్లారిటీ ఇచ్చాడు. అతనికి తాను ఎలాంటి సాయం చేయలేదని స్పష్టం చేస్తూ ఓ నోట్ రిలీజ్ చేశాడు.
Sai Dharam Tej Responds to Abdul Farhan Comments: ”నాపై, నా టీమ్ పై అసత్య ప్రచారాలు చేస్తున్నారనే విషయం ఈరోజే నా దృష్టికి వచ్చింది. ఫర్హాన్ కు సాయం చేశానని, నేను కానీ నా టీం కానీ ఎక్కడా చెప్పలేదు. కావాలంటే ఈ ఇంటర్వ్యూ వీడియో చూడండి. నాకు నా ఫ్యామిలీకి అతడు చేసిన సాయానికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను.
అతడి వద్ద మా వివరాలు ఉన్నాయని.. సహాయం కోసం మా వద్దకు వస్తే తప్పకుండా చేస్తానని మాటిచ్చానని నేను చెప్పాను. నా మేనేజర్ శరణ్ అతడికి ఎప్పుడూ దగ్గరలోనే ఉంటాడు. ఈ విషయంపై ఇదే నా చివరి వివరణ” అని సాయి తేజ్ ప్రకటనలో పేర్కొన్నాడు. దీనికి తను మాట్లాడిన వీడియో (ఇంటర్వ్యూ)ని జత చేశాడు.
కాగా, 2021 సెప్టెంబర్ లో సాయి తేజ్ హైదరాబాద్ లోని కేబుల్ బ్రిడ్జ్ సమీపంలో ప్రమాదవశాత్తు బైక్ పై నుంచి కింద పడ్డాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయన్ని.. ఫర్హాన్ గుర్తించి సాయం చేశాడు. దీంతో ఫర్హాన్ పేరు వార్తల్లో నిలిచింది. ఇక ఇటీవల ‘విరూపాక్ష’ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో తన ప్రాణాలు కాపాడిన ఫర్హాన్ గురించి సాయి తేజ్ స్పందించాడు. ఫర్హాన్ కు తాను ఎలాంటి సాయం చేయలేదని.. డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకోవడం తనకు నచ్చదని అన్నాడు. తన ప్రాణాలను కాపాడిన వ్యక్తికి ఎప్పటికీ రుణపడే ఉంటానని చెప్పాడు తేజ్.
ఈ నేపథ్యంలో అతనికి మెగా ఫ్యామిలీ నుంచి భారీగా రివార్డులు అందాయని చాలా కథనాలు వచ్చాయి. వీటిపై ఫర్హాన్ తాజాగా స్పందించాడు. తనకు తేజ్ నుంచి ఎలాంటి సాయం అందలేదని స్పష్టం చేశాడు. తనకు భారీగా బహుమతులు, డబ్బు అందిందంటూ చుట్టుపక్కల వాళ్ళు ట్రోల్ చేస్తున్నారని.. దీంతో ఉద్యోగం కూడా పోయిందని వాపోయాడు ఫర్హాన్. దీంతో తేజ్ కు వ్యతిరేకంగా కథనాలు వచ్చాయి.
ఈ అంశంపై ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ స్పందిస్తూ వివరణ ఇచ్చాడు. తన ప్రాణాలు కాపాడిన వ్యక్తికి ఒకటీ రెండు లక్షల డబ్బు ఇచ్చి రుణం తీర్చుకోవడం కరెక్ట్ కాదని అభిప్రాయపడ్డాడు. సాయం చేసిన వ్యక్తిని మరిచిపోయే వ్యక్తిని కాదని, ఫర్హాన్ ఎప్పుడు ఏ సాయం కావాలన్నా చేయటానికి తను తన టీమ్ అందుబాటులో ఉంటారని తేజ్ చెప్పుకొచ్చాడు.