సల్మాన్ ఖాన్ చేస్తోందే కరెక్ట్..!

343

లాక్ డౌన్ నేపథ్యంలో సినిమా షూటింగ్ లు కూడా ఆగిపోయాయి. పెద్ద పెద్ద స్టార్స్ ఎలాగోలా గడిపేస్తారు.. ఎందుకంటే వారి రెమ్యునరేషన్ అలాంటిది. కానీ సినిమా షూటింగ్ లను నమ్ముకుని.. రోజూ వెళుతూ.. సాయంత్రం అయితే చాలు డబ్బు చేతిలోకి తీసుకునే వారి పరిస్థితి ప్రస్తుతం చాలా దీనంగా ఉంటుంది. అలాంటి వారిని ఆదుకోడానికి పలువురు స్టార్స్ ముందుకు వస్తున్నారు. ప్రతి ఇండస్ట్రీ నుండి పెద్ద పెద్ద స్టార్స్ తమకు తోచినంత సహాయం చేస్తూ ఉన్నారు.

బాలీవుడ్ ను నమ్ముకున్న రోజు కూలీలను ఆదుకోడానికి సల్మాన్ ఖాన్ ముందుకు వచ్చారు. 25,000 వేల మందికి సహాయం చేస్తానని తెలిపిన సల్మాన్ ఖాన్ వారికి ఆర్థిక సాయం అందజేసే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఫెడరేషన్ వెస్ట్రన్ ఇండియన్ సినీ ఎంప్లాయీస్ (ఎఫ్ డబ్ల్యుఐసీఈ) అధ్యక్షుడు బీఎన్ తివారి మాట్లాడుతూ రోజు కూలీ సినీ కార్మికులకు ఒక్కొక్కరికి రూ.3000 చొప్పున ఇచ్చే కార్యక్రమాన్ని సల్మాన్ ఖాన్ ప్రారంభించారన్నారు. 23,000 మంది సినీ కార్మికులతో కూడిన జాబితాను సల్మాన్ కు అందజేశామని, దాని ప్రకారం ఆయా అకౌంట్లకు మూడు వేల రూపాయల చొప్పున మనీ ట్రాన్స్ ఫర్ చేస్తున్నారని అన్నారు.

డైరెక్ట్ గా ఇలా అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేయడం చాలా మంచి పనే..! మధ్యలో మూడో వ్యక్తి లేకుండా.. ఇలా సంబంధిత వ్యక్తుల అకౌంట్లోకి డైరెక్ట్ గా డబ్బులు వేయడమే కరెక్ట్ అని ఇండస్ట్రీ ప్రముఖులు అంటున్నారు. పలు విషయాల్లో సల్మాన్ ఖాన్ ను తప్పుపట్టే బాలీవుడ్ జనాలు ఈ విషయంలో మాత్రం పొగడ్తల వర్షాన్ని కురిపిస్తున్నారు.