Sarileru Neekevvaru interesting Promostion Plane Mass Mahesh Monday Updates
Sarileru Neekevvaru interesting Promostion Plane Mass Mahesh Monday Updates

సూపర్ స్టార్ మహేష్ బాబు మంచి దూకుడు మీదున్నాడు. ఇటీవలే మహర్షి రూపంలో తన సిల్వర్ జూబ్లీ సినిమాతో సంచలన విజయం సాధించిన ఆయన ఇప్పుడు ‘సరిలేరు నీకెవ్వరు’ అంటూ ప్రేక్షకుల ముందు రాబోతున్నాడు. ఈ ఏడాది సంక్రాంతికి ‘ఎఫ్ 2’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అనీల్ రావిపూడి సూపర్ హిట్ దక్కించుకున్నాడు. అందుకే వచ్చే ఏడాది సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని తీసుకు వచ్చి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకునేందుకు దర్శకుడు అనీల్ రావిపూడి ఉవ్విల్లూరుతున్నాడు.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్‌పై ప్రత్యేక దృష్టి సారించింది ‘సరిలేరు నీకెవ్వరు’ యూనిట్. సినిమా ప్రమోషన్స్ విషయంలో నిన్న మొన్నటి వరకు సైలెన్స్ ను మెయింటెన్ చేశారు. కాని ఇప్పుడు సినిమా పబ్లిసిటీ విషయంలో సరికొత్త వ్యూహాలను అమలు చేస్తూ సరిలేరు మీకెవ్వరు అనిపించుకుంటున్నారు. ఇప్పటికే ప్రమోషన్లు స్టార్ట్ చేసిన ఈ టీమ్.. ‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్ రిలీజ్ చేసి బ్రహ్మండమైన కిక్ స్టార్ట్ ఇచ్చేసింది. ఆపై పలు పోస్టర్స్ ద్వారా ఆకట్టుకుంది. దీంతో ఈ సినిమాకు బాగా కనెక్ట్ అయ్యారు జనం.

అనిల్ యూనిట్ ఇకపై ప్రతి వారం కూడా సందడి చేసేలా ప్రయత్నాలు చేస్తున్నారు. సినీ వర్గాల నుండి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం వారంలో ప్రతి సోమవారం కూడా సినిమాకు సంబంధించిన ఏదో ఒక అప్ డేట్ ను ఇవ్వబోతున్నారు. ఈ అప్‌డేట్స్‌లో పాటలు, కౌంట్‌డౌన్ పోస్టర్స్, గ్లింప్స్, వీడియోస్, ట్రైలర్ అన్నీ ఉంటాయట. అంటే ఇకపై సంక్రాంతి వచ్చేదాకా ప్రతి సోమవారం మహేష్ అభిమానులకు పండగే అని చెప్పుకోవచ్చు.

అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన రష్మిక మందన్న కథానాయికగా నటిస్తోంది. సీనియర్ నటి విజయశాంతి ప్రధాన పాత్ర పోషిస్తోంది. భారీ అంచనాల నడుమ జనవరి 11వ తేదీన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం విడుదల కానుంది.