శర్వానంద్ శ్రీకారం రివ్యూ..!

491
Sharwanand Sreekaram Review Rating

విడుదల తేదీ : మార్చి 11, 2021
రేటింగ్ : 3/5
నటీనటులు : శర్వానంద్, ప్రియాంకా అరుళ్ మోహన్, రావు రమేష్, శ్రీ నరేష్, సాయి కుమార్, మురళి శర్మ తదితరులు.
దర్శకత్వం : కిషోర్.బి
నిర్మాత‌లు : రామ్ ఆచంట, గోపి ఆచంట
సంగీతం : మిక్కీ జె మేయర్
సినిమాటోగ్రఫీ : జె యువరాజ్
ఎడిటింగ్ : మార్తాండ్ కె వెంకటేష్

వ్యవసాయం మీద ఇప్పటికే తెలుగులో ఎన్నో సినిమాలు వచ్చాయి. కొద్ది సంవత్సరాల కిందట మహేష్ బాబు నటించిన మహర్షి సినిమాలో కూడా వ్యవసాయం గురించి చెప్పించారు. ఇప్పుడు యంగ్ హీరో శర్వానంద్ వ్యవసాయం మీద ‘శ్రీకారం’ సినిమాలో నటించాడు. అందరూ వ్యవసాయాన్ని మరచిపోతున్న సమయంలో ఇలాంటి సినిమాలు రావడం మంచిదే అయినప్పటికీ మరీ సినిమా పరంగా ఎంటర్టైనింగ్ గా సాగిందా లేదా అన్నది కూడా మూవీ మేకర్లు చూసుకోవాలి.

రైతులు సొంత ఊళ్లను వదిలేసి పట్టణాల్లో ఏవేవో పనులు చేసుకుంటూ గడిపేస్తూ ఉంటారు.. కానీ సమిష్ఠిగా వ్యవసాయం చేస్తే రైతే రాజు అని నిరూపించొచ్చు. అదే ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేశారని ట్రైలర్ ద్వారా మనకు అర్థం అవుతుంది. బి కిషోర్ శ్రీకారం సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇది అతడికి మొదటి సినిమా. ఈ సినిమాలో శర్వాకు జోడీగా గ్యాంగ్ లీడర్ ఫేమ్ ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తుంది. శ్రీకారం సినిమాను 14 రీల్స్ సంస్థ నిర్మించింది.

కథ:
కార్తీక్ (శర్వానంద్) హైదరాబాద్ సిటీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ గా లక్షల్లో జీతం సంపాదిస్తూ ఉంటాడు. అనంతరాజపురం సొంత ఊరు. తండ్రి కేశవులు(రావు రమేష్) చేసిన అప్పులను తీరుస్తూ ఉంటాడు. ఇక చైత్ర(ప్రియాంకా అరుళ్‌ మోహన్)కు కార్తీక్ ను పెళ్లి చేసుకోవాలని అతడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆమె మీద కార్తీక్ కు ప్రేమ ఉన్నప్పటికీ.. కొన్ని కారణాల వద్ద చెప్పలేడు. ఇక కంపెనీలో తన వర్క్ తో ఇంప్రెస్ చేస్తూ వెళ్లిన కార్తీక్.. ప్రాజెక్ట్ వర్క్‌ను విజయవంతంగా పూర్తీ చేస్తుండడంతో కంపెనీ యాజమాన్యం అతన్ని అమెరికా పంపించాలని అనుకుంటుంది.

తండ్రి కేశవులు కూడా సొంత ఊర్లో ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికీ చెప్పుకుంటున్న సమయంలో కార్తీక్ మాత్రం తన తండ్రి మాటను కాదని మరీ వ్యవసాయం చేయడానికి సిద్ధమవుతాడు. ఉమ్మడి వ్యవసాయం మొదలు పెడతాడు.కార్తీక్ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాన్ని వదిలేసి వ్యవసాయం వైపు ఎందుకు మళ్లాడు? అతడి తండ్రి పంతం నెగ్గిందా..? అనంతరాజపురంలో కార్తీక్ కు అండగా ఎవరైనా నిలిచారా..? వ్యవసాయం రాబోయే తరాలకు ఎంత ముఖ్యం..? అనే విషయాన్ని కార్తీక్ నిజం చేసి చూపించాడా అన్నది తెలియాలంటే శ్రీకారం సినిమా చూడాల్సిందే..!

నటీనటులు:
సినిమా మొత్తం శర్వానంద్ వన్ మ్యాన్ ఆర్మీ లాగా కనిపిస్తాడు. శర్వానంద్ లేని సీన్లు చాలా తక్కువే.. అటు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గానూ.. ఇటు టెక్నాలజీని ఉపయోగించి వ్యవసాయం చేసే సీన్లలో బాగా చేశాడు. ఇక ఎమోషనల్ సీన్లలో తనదైన నటనతో మెప్పించాడు. చైత్ర పాత్రలో ప్రియాంక అరుళ్ మోహన్ బాగా చేసింది. రావు రమేష్ మరోసారి మెప్పించాడు. ఏకాంబరం పాత్రలో సాయి కుమార్‌, హీరో తల్లిగా ఆమని, నరేశ్‌, మురళి శర్మ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. సత్య, సప్తగిరి ఉన్నంతలో మెప్పించారు.

విశ్లేషణ:
ఆదర్శ రైతులకు సంబంధించిన వార్తలను మనం చాలా సార్లు చదివే ఉంటాం.. వినే ఉంటాం. లక్షల జీతం వదిలేసి సొంత ఊళ్లకు వచ్చి విజయాలను సాధించిన నయా జమానా రైతు కథ లాంటిదే శ్రీకారం. సొంత ఊళ్ళను వదిలేసిన జనాలు, వ్యవసాయం అంటే భయపడుతున్న రైతులు.. ఇలాంటివి మన చుట్టూ జరుగుతూ ఉన్నావే.. కానీ ఇది కమర్షియల్ కోణంలో చూపించలేకపోయాడు దర్శకుడు. సినిమాటోగ్రఫి, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

ముఖ్యంగా గతంలో రైతుల మీద వచ్చిన సినిమాలాగే ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది. నిడివి తక్కువే అయినా కూడా.. ముందుకు సాగడం లేదే అనే ఫీలింగ్ కూడా కలగొచ్చు. రైతు యొక్క గొప్పతనాన్ని తెరపై చక్కగా చూపించాడు దర్శకుడు బి.కిశోర్‌. కొత్తదనం లేకపోవడం మైనస్ గా అనిపిస్తుంది. కథ కూడా పెద్దగా ముందుకు సాగుతూ అనిపించదు. మిక్కీ జె. మేయర్ సంగీతం పర్లేదు. సాయి మాధవ్‌ బుర్రా రాసిన డైలాగ్స్ బాగున్నాయి. ఎడిటర్‌ మార్తండ్‌ కె వెంకటేశ్‌ ఇంకాస్త పని చెప్పి ఉండాల్సింది అని అనిపించక మానదు. కమర్షియల్ గా ఉంటుంది అని అంచనాలు పెట్టుకోకండి. ఓ మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలా మనకు అనిపిస్తుంది అంతే..!