సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ శ్రుతీహాసన్ ప్రస్తుతం తమిళంలో విజయ్ సేతుపతి సరసన హీరోయిన్ గా ఒక సినిమాలో నటిస్తోంది. ప్రియుడు మైకేల్ కోర్సలేతో పీకల్లోతు ప్రేమలో మునిగితేలిన శృతిహాసన్ కొన్ని రోజులపాటు సిల్వర్ స్క్రీన్‌కి దూరంగా ఉండి తిరిగి రీసెంట్గా కెమెరా ముందుకొచ్చింది. ప్రస్తుతం విజయ్ సేతుపతి సినిమా షూటింగుల్లో పాల్గొంటున్న శృతి..షూటింగ్ నుండి మధ్యలోనే వెళ్లిపోయి అందరికీ షాకిచ్చింది.
విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న `లాభం` అనే తమిళ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తోంది. దర్శకుడు ఔట్ డోర్ లో విజయ్ సేతుపతి, శ్రుతీహాసన్ పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాడు. ఆ సమయంలో వందల మంది ప్రజలు ఆ సినిమా షూటింగ్ ను చూడడానికి ఎగబడ్డారు. దీంతో శృతిహాసన్ ఆ షూటింగ్‌ని మధ్యలోనే వదిలేసి జంప్ కావడమే గాక, కనీస జాగ్రత్తలు తీసుకోకుండా చిత్రీకరణ ఎలా చేస్తున్నారంటూ యూనిట్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిందని తెలిసింది.
ఆమె అర్ధాంతరంగా వెళ్లిపోవడంతో షూటింగ్ కు పేకప్ చెప్పేసింది చిత్ర బృందం. ఈ విషయం కోలీవుడ్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. గతంతో పోల్చితే కరోనా భయం కాస్త తగ్గినా ప్రస్తుతం దేశవిదేశాల్లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఇదే శృతిహాసన్ అలా షూటింగ్ మధ్యలో వదిలేసి వెళ్ళడానికి కారణం అని సమాచారం. అంతమంది జనం ఒక్కచోట చేరడం చూసి కరోనా భయంతో శృతి ఆ ప్రదేశం వదిలి వెళ్లిందట. ఈ సమయంలో ప్రతి ఒక్కరి ఆరోగ్యం ముఖ్యమని, కరోనా మన దేశం నుండి ఇంకా పోలేదని, ప్రతి ఒక్కరు సోషల్ డిస్టెన్స్ పాటించాలని అన్నారు ఆమె. షూటింగ్ లో అందురూ తమ యొక్క ప్రొటోకాల్ పాటించాల్సిందేనని, లేకపొతే ఒక మహిళగా నా ఆరోగ్య జాగ్రత్తలు నేను చూసుకుంటానని తెలిపింది శ్రుతి.