టాలెంటెడ్ యంగ్ యాక్టర్ సిద్ధు జొన్నలగడ్డ.. స్టార్ బోయ్‌గా తెలుగు ఆడియన్స్ కి సుపరిచితులు. ఆయన ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. సీఎం రిలీఫ్ ఫండ్ కోసం రూ.15లక్షల చెక్కును అందించారు. రెండు తెలుగు రాష్ట్రాలను వరదలు ముంచినప్పుడు తనవంతు సాయం అందిస్తానని మాటిచ్చారు సిద్ధు జొన్నలగడ్డ
రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి రూ.30లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు సిద్ధు జొన్నలగడ్డ. అందులో భాగంగానే ఇవాళ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి రూ.15లక్షలను అందించారు. తెలుగు రాష్ట్రాలను వరదలు ముంచెత్తినప్పుడు ఎమోషనల్ నోట్ పోస్ట్ చేశారు సిద్ధు జొన్నలగడ్డ. `ఇలా జరగకుండా ఉండాల్సింది. ఇదేం భావ్యం కాదు. ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఎవరికీ రాకూడదు.
వరదల కారణంగా ఎంతో మంది నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సమయంలోనే మనమందరం ఏకమయ్యి చేయూతనివ్వాలి. నా వంతుగా రూ.30లక్షలను (ఏపీ, తెలంగాణకు తలా రూ.15లక్షలు)ను వరద నివారణ నిధికి అందజేస్తాను. జరిగిన నష్టాన్ని డబ్బుతో భర్తీ చేయలేమని తెలుసు. అయినా ఏదో రకంగా కొందరి జీవితాలను పునరుద్ధరించడానికి, వారిలో నమ్మకాన్ని కలిగించడానికి ఈ డబ్బు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను` అని అందులో రాశారు.
అప్పుడు తానిచ్చిన మాటను దృష్టి లో పెట్టుకుని, సిద్ధు ఇవాళ నేరుగా వెళ్లి సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి చెక్కును అందించారు. సిద్ధు జొన్నలగడ్డతో పాటు ఆయన తండ్రి సాయికుమార్ కూడా ఉన్నారు. కాంగ్రెస్ లీడర్ డాక్టర్ సి రోహిన్ రెడ్డి, మహేంద్ర, నిర్మాత కాశీ కొండ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.