Sita Ramam and Balagam Movies wins Dada Saheb Phalke Awards: సినీ రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే పురస్కారాల్లో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్స్ కూడా ఉంటాయి. ‘ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా’ ఫాల్కే పేరు మీదుగా ప్రతీ ఏడాది ఈ అవార్డుల ప్రధానోత్సవం జరుగుతుంది. అయితే 13వ దాదా సాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్-2023 లో తెలుగు సినిమాలు సత్తా చాటాయి. 81 దేశాల నుంచి దాదాపు 780కి పైగా సినిమాలు ఈ పోటీలో పాల్గొనగా.. ‘సీతారామం’, ‘బలగం’ చిత్రాలు అవార్డులు అందుకున్నాయి.
Sita Ramam and Balagam Movies wins Dada Saheb Phalke Awards: మలయాళ హీరో దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ’సీతారామం’. హను రాఘవపూడి దర్శకత్వం వచ్చిన ఈ చిత్రంలో రష్మిక మందన్న కీలక పాత్రలో నటించింది. వైజయంతీ మూవీస్ బ్యానర్ లో అశ్వినీ దత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. యుద్ధం నేపథ్యంలో తెరకెక్కిన ఈ అందమైన ప్రేమకథకు అన్ని వర్గాల ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దీంతో బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ మూవీ తాజాగా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు సాధించింది.
13వ దాదాసాహెబ్ ఫాల్కే (Dada Saheb Phalke) ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో 2023 సంవత్సరానికి గాను బెస్ట్ ఫిలిం జ్యూరీ క్యాటగిరీలో ‘సీతారామం’ (Sita Ramam) సినిమాకి అవార్డ్ లభించింది. ఈ విషయాన్ని చిత్ర దర్శక నిర్మాతలు సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు ‘బలగం’ (Balagam) సినిమాకు కూడా ఈ ప్రెస్టీజియస్ అవార్డు వరించింది.
దిల్ రాజు ప్రొడక్షన్ లో కమెడియన్ వేణు తొలిసారిగా తెరకెక్కించిన సినిమా ‘బలగం’ (Balagam). తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు, బంధాలు, బంధుత్వాలు, విలువలను ఈ చిత్రంలో కళ్ళకు కట్టినట్లు చూపించారు. ఇందులో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో నటించారు. స్టార్ కాస్టింగ్ లేకున్నా, ఈ చిత్రానికి ప్రాంతంతో సంబంధం లేకుండా ప్రేక్షకులు బ్రహ్మ రధం పట్టారు. థియేటర్స్ లో ఓటీటీలో సంచలనం సృష్టించిన ఈ సినిమా.. విమర్శకుల ప్రశంసలతో పాటుగా ఎన్నో అవార్డులను సాధించింది.
చిన్న సినిమాగా రిలీజై పెద్ద విజయం సాధించిన ‘బలగం’ చిత్రానికి ఇప్పటి వరకు దాదాపు 40 అవార్డులు వచ్చాయి. ఈ క్రమంలో తాజాగా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ (Dada Saheb Phalke) వరించింది. బెస్ట్ మ్యూజిక్ కేటగిరీలో సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరిలియోకి పురస్కారం లభించింది. నిర్మాత హర్షిత్ రెడ్డి తో కలిసి భీమ్స్ ఈ ప్రెస్టీజియస్ అవార్డును అందుకున్నాడు. ఈ విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు.