sukumar and udaya bhanu emotional comments on justice for Disha
sukumar and udaya bhanu emotional comments on justice for Disha

శంషాబాద్ వెటర్నరీ డాక్టరు హత్యాచారం ఘటన దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఇలాంటి కేసుల్లో బాధితురాలి పేరును, వారి కుటుంబసభ్యుల పేర్లను, వివరాలను ఎక్కడా ప్రస్తావించకూడదని సుప్రీంకోర్టు గతంలో ఆదేశాలు ఇచ్చింది. ఆమె ఆమె పేరును ‘దిశ’గా మారుస్తున్నట్టు సీపీ సజ్జనార్ ప్రకటించారు. ఈ విషయమై ఆమె తల్లిదండ్రుల అనుమతి తీసుకున్నట్టు చెప్పారు. మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో ఆమె పేరును ‘దిశ’ అని పేర్కొనాలని చెబుతున్నారు. ‘జస్టిస్ ఫర్ దిశ’కు అందరూ సహకరించాలని కోరారు.

ఈ ఘటనపై పలువురు ప్రముఖులు స్పందించారు. దర్శకుడు సుకుమార్ మాటలు విన్నాక.. ఆ అమ్మాయి ఎందుకు పోలీసులను ఆశ్రయించాలని అనుకోలేదో మనకు అర్థం అవుతుంది. ఈ ఘటనపై సుకుమార్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నేరస్తులు ఎక్కడి నుంచో రారని, మన మధ్యే తయారవుతారని అన్నారు. ఆమె ఆ సమయంలో 100 నంబరుకు ఫోన్ చేయాల్సిందని చాలామంది చెబుతున్నారు. కానీ నలుగురు కుర్రాళ్లు హెల్ప్ చేస్తామని ముందుకు వస్తే తాను 100 నంబరుకు ఫోన్ చేయడం ఏం బాగుంటుందని ఆ అమ్మాయి భావించి ఉంటుందని ఆయన అన్నారు. సాయం చేయడానికి వస్తే పోలీసులను పిలుస్తావా అక్కా అని వాళ్లు అడిగితే తాను ఏంచెప్పగలనని ఆమె అనుకుని ఉండొచ్చు.. అమ్మాయిలు అబ్బాయిల్ని అంతగా నమ్ముతారు. కానీ తల్లీ, దయచేసి మమ్మల్ని నమ్మొద్దమ్మా! మేం మృగాళ్లం. సొంతవాళ్లను కూడా నమ్మొద్దు తల్లీ. ప్రతి ఒక్కరినీ అనుమానించండి… అనుమానం వస్తే ముందు 100 నంబరుకు ఫోన్ చేయండి. ఒకవేళ మనం పొరబడితే క్షమాపణ అడుగుదాం అంతే తప్ప ప్రమాదంలో చిక్కుకోవద్దని ఆయన అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

ఈ ఘటనపై ప్రముఖ యాంకర్ ఉదయ భాను స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ఉద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నారు. చిన్న పిల్లలపై కూడా క్రూరంగా ప్రవర్తిస్తున్నారని.. తన పిల్లలను కూడా బడికి పంపుతున్నానని, చాలా భయపడుతున్నానని అన్నారు. దిశ ఘటనపై సోషల్ మీడియాలో కొందరు విషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఉదయభాను ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి వారు చీడపురుగులాంటి వారని వ్యాఖ్యానించారు. రాత్రి పూట తోపులాగ ఒంటరిగా వెళ్లే అమ్మాయిలకు ఇలాగే అవ్వాలంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి వారిని తుపాకీతో కాల్చి పడేయాలని అన్నారు. కన్నీరు పెడుతూ.. దిశ ఘటనకు బాధ్యులను కఠినంగా శిక్షించాలని ఆమె చెప్పుకొచ్చారు.