సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టిన రోజు డిసెంబర్ 12.. ఆరోజున ఆయన అభిమానులు చేసే సందడి అంతా ఇంతా కాదు. అయితే ఇటీవలి కాలంలో కొన్ని కారణాల వలన రజనీకాంత్ తన బర్త్‌డేను జరుపుకోవడం లేదు. కానీ ఆయన ఇంట్లో తాజాగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. ఆయన జన్మ నక్షత్రం శ్రావణం సోమవారం నుండి మొదలు కావడంతో రజనీకాంత్ తన ఇంట్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వేదమంత్రాల మధ్య శాస్త్రోత్తంగా పూజలు నిర్వహించారు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి.
సింప్లిసిటీ విషయంలో రజనీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఎవరిని ఎలా గౌరవించాలో తెలుసు. ప్రస్తుతం రజనీకాంత్ సింప్లిసిటీకి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ ఉన్నాయి. రజనీ స్వయంగా ఓ అభిమాని కాళ్లు పట్టుకోవడం ఎంతోమందిని ఆశ్చర్యపరుస్తోంది. కేరళకు చెందిన ప్రణవ్ అనే దివ్యాంగుడికి రజనీ అంటే చాలా ఇష్టం. తన అభిమాన హీరోని కలవాలని ఎవరికి ఉండదు చెప్పండి.. ఆ విషయం రజనీకాంత్ వరకు చేరడంతో ప్రణవ్‌ని తన ఇంటికి ఆహ్వానించారు. అతను రావడానికి టికెట్స్ కూడా ఆయనే బుక్ చేయించారట. సంతోషంగా వచ్చిన ప్రణవ్.. తన కాళ్లతో గీసిన రజనీ చిత్రాన్ని తీసుకొచ్చి ఆయనకు బహుమతిగా ఇచ్చాడు. దాన్ని ఆనందంగా అందుకున్న రజనీ.. కాలు పట్టుకుని కృతజ్ఞతలు చెప్పారు.
సినిమాల పరంగా చూస్తే రజనీకాంత్ ఇటీవలే స్పీడ్ పెంచారు. రాబోయే రోజుల్లో రాజకీయాలకు సమయం కేటాయించాలి కాబట్టి.. చకచకా సినిమాలు చేయడం మొదలుపెట్టారు రజనీ. దర్భార్ సినిమా అనంతరం విశ్వాసం ఫేమ్ శివ దర్శకత్వంలో రజనీకాంత్ 168వ చిత్రం రూపొందనుంది. డిసెంబర్ మూడో వారంలో చిత్రం షూటింగ్ మొదలవ్వనుండగా ఈ చిత్రంలో కథానాయికగా మీనా ఎంపికైందని చెబుతున్నారు. మీనా-రజనీకాంత్ కాంబినేషన్ అప్పట్లో దక్షిణాదిని ఒక ఊపు ఊపేసింది. వారిద్దరూ కలిసి నటించిన యజమన్, వీరా, ముత్తు హిట్స్ గా నిలిచాయి. ఇప్పుడు మరోసారి వారిద్దరూ జోడీ కట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్త నిజమా కాదా అన్నది.. మరికొద్ది రోజుల్లో తెలియనుంది.