మూవీ రివ్యూ : ఆకాశం నీ హద్దురా

చిత్రం : ఆకాశం నీ హద్దురా (Surya Aakaasam Nee Haddhu Raa Movie OTT Review Rating)
రేటింగ్: 3.5/5
నటీనటులు: సూర్య-అపర్ణ బాలమురళి-పరేష్ రావల్-మోహన్ బాబు-ఊర్వశి-కరుణాస్ కాళి- అచ్యుత్ కుమార్- వివేక్ ప్రసన్న తదితరులు
సంగీతం: జి.వి.ప్రకాష్ కుమార్
ఛాయాగ్రహణం: నికేత్ బొమ్మి
కథ: సుధ కొంగర
స్క్రీన్ ప్లే: సుధ కొంగర-షాలిని-ఆలిఫ్-గణేశ
మాటలు: రాకేందుమౌళి
నిర్మాత: సూర్య
దర్శకత్వం: సుధ కొంగర

తమిళ హీరో సూర్య, ప్రతిభావంతురాలైన దర్శకురాలు ‘గురు’ ఫేమ్ అయిన సుధ కొంగర కాంబినేషన్‌లో తమిళంలో రూపొందిన చిత్రం ‘ఆకాశం నీ హద్దురా!’ పేరిట తెలుగులోకి అనువాదం చేశారు. సూర్య స్వయంగా నిర్మించిన ఈ సినిమాను నేరుగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేశారు.  భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా  ఏమేర అందుకుందో చూద్దాం పదండి.

కథ

చంద్రమహేష్ (సూర్య) ఒక పల్లెటూరి కుర్రాడు. తాను అనుకున్నది ఏదైనా సరే పట్టు విడువకుండా పోరాడి సాధించుకునే తత్వం ఉన్న అతను.. ఓ విషయంలో తండ్రితో గొడవపడి ఇల్లు విడిచి వెళ్లిపోతాడు. ఎయిర్ ఫోర్స్‌లో చేరతాడు. ఐతే తండ్రి చావుబతుకుల్లో ఉన్న సమయంలో చేతిలో సరిపడా డబ్బుల్లేక విమానంలో ప్రయాణించలేకపోయిన చంద్రమహేష్.. తండ్రి కడసారి చూపుకు కూడా నోచుకోలేకపోతాడు. విమానయానం ధనవంతులకే కాదు సాధారణ ప్రజలకు కూడా అని బలంగా నమ్మి తక్కువ ధరకే విమాన సర్వీసులు ప్రారంభించాలని కంకణం కడతాడు.

ఒక సాధారణ స్కూల్ మాస్టారు కొడుకు డెక్కన్ ఎయిర్ అనే విమానయాన సంస్థను ఎలా స్థాపించగలిగాడు అనేదే ఈ చిత్ర ప్రధాన కథ. ఎయిర్ డెక్కన్ వ్యవస్థాకుడు కెప్టెన్ జి.ఆర్. గోపీనాథ్ జీవిత కథ ఆధారంగా చేసుకుని విమానయాన రంగంలో వచ్చిన మార్పులను వివరిస్తూ కొంత కల్పిత కథను జతచేసి ఈ సినిమాను రూపొందించారు. ఈ యుద్ధంలో మహా ఎలా గెలిచాడు? డెక్కన్ ఎయిర్‌ను ఎలా స్థాపించాడు? అనేదే సినిమా.

విశ్లేషణ
విమానయానం డబ్బున్న వాళ్లకే కాదు సాధారణ ప్రజలకు కూడా అనే ఆలోచనతో ఒక విమానయాన సంస్థను మహా స్థాపించిన విధానాన్ని దర్శకురాలు సుధ కొంగర చాలా బాగా చూపించారు. ‘గురు’ సినిమాతో ఆకట్టుకున్న దర్శకురాలు సుధ కొంగర ‘ఆకాశం నీ హద్దురా’లో ఆ సమతూకాన్ని సాధించగలిగింది. ఎయిర్ డెక్కన్ ఎయిర్ లైన్స్ తో భారత విమాన యాన రంగంలో సంచలనాలకు తెర తీసిన గోపీనాథ్ జీవిత కథను అర్థవంతంగా ఉద్వేగ భరితంగా తెరపై చూపించి ప్రేక్షకుల్లో కదలిక తీసుకు రాగలిగింది. ముఖ్యంగా సినిమాలో ఎమోషన్ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అవుతుంది.

- Advertisement -

హీరో సూర్య ఈ సినిమాను తన భుజస్కందాలపై మోశారు. సూర్య నుంచి గత కొన్నేళ్లలో వచ్చిన ఉత్తమ చిత్రంగా ‘ఆకాశం నీ హద్దురా’ నిలుస్తుంది. చాలా రోజుల తర్వాత సూర్య నుంచి మరోసారి అద్భుతమైన నటనను ఈ సినిమాలో చూస్తాం. విమానం టిక్కెట్‌కు డబ్బులు సరిపోకపోతే ఎయిర్‌పోర్టులో తప్పని పరిస్థితుల్లో డబ్బుల కోసం యాచించే సన్నివేశంలో సూర్య నటన మరో స్థాయిలో ఉంది. ‘పెద్ద కల కను.. ఆ కలను నెరవేర్చుకునే క్రమంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా విశ్రమించకు’ అనే స్ఫూర్తిదాయక సందేశం నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ‘ఆకాశం నీ హద్దురా’. ప్రస్తుత తరంలో ఉన్న మంచి నటుల్లో సూర్య ముందు వరుసలో ఉంటారని చెప్పడానికి ఈ సన్నివేశం ఒకటి చాలు.

ఒక మామూలు పల్లెటూరి కుర్రాడు.. తన లాంటి సామాన్యులు రైలు టికెట్ ధరతో విమానంలో ప్రయాణించేలా చేయాలన్న అసాధారణ కలను నెరవేర్చుకోవడానికి చేసే ప్రయత్నమే ఈ సినిమా. సూర్య భార్య సుందరి అలియాస్ బేబీ పాత్రలో నటించిన అపర్ణ బాలమురళి నటన కూడా చాలా బాగుంది. గ్రామీణ ప్రాంతానికి చెందిన గడసరి అమ్మాయిగా పాత్రలో జీవించేసింది. ఆమె పాత్ర చిత్రీకరణలో దర్శకురాలు సుధ కొంగర మార్క్ కనబడింది. సూర్య, అపర్ణ ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ చాలా బాగుంది.

ఇక ఈ సినిమాకు ఉన్న మరో బలం రచన. షాలిని ఉషాదేవి, సుధ కొంగర కలిసి ఈ సినిమా స్క్రిప్ట్ రాశారు. ఐతే ఇదో కల్పిత గాథ అయితే.. హీరోతో ఎన్ని విన్యాసాలైనా చేయించొచ్చు. ఎలా కావాలనుకుంటే అలా కథను తిప్పేసి హీరోను విజేతగా నిలబెట్టేయొచ్చు. కానీ నిజంగా ఒక సామాన్యుడు సున్నా నుంచి మొదలుపెట్టి ఆ లక్ష్యాన్ని అందుకోవడం అంటే మాటలు కాదు. ఆ ప్రయాణాన్ని సాధ్యమైనంతగా ఆసక్తికర రీతిలో తెరపై ప్రెజెంట్ చేసింది సుధ. విమానయానం అంటేనే ఖరీదైనది. ప్రస్తుతం బోలెడన్ని హంగులతో ఖరీదైన ప్రయాణాన్ని అందించే విమానయాన సంస్థలు ఉండగా.. అతి తక్కువ ధరకే టిక్కెట్ ఆఫర్ చేసే విమానాలు ఎవరు ఎక్కుతారు అన్న ప్రశ్నకు చెప్పిన ఉడిపి హోటల్ వర్సస్ ఫైవ్ స్టార్ హోటల్ ఉదాహరణ ఓ అద్భుతం.

సినిమా మొత్తం ఒక ఫ్లోలో వెళ్లిపోతూ ఉంటుంది. కామెడీ కావచ్చు.. రొమాన్స్ కావచ్చు.. గొడవ కావచ్చు.. బాధ కావచ్చు.. హీరో హీరోయిన్ల మధ్య వచ్చే ప్రతి సన్నివేశం అలా కళ్లప్పగించి చూసేలా చేయడంలో దర్శకురాలి ప్రతిభను మెచ్చుకోవాలి.  ఫస్టాఫ్ చాలా వేగంగా అయిపోయినట్టు అనిపిస్తుంది. సెకండాఫ్ కాస్త సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. కొన్ని సన్నివేశాలు మనం ఊహించగలుగుతాం. అయినప్పటికీ దర్శకురాలు ఎమోషన్‌ను క్యారీ చేయడం వల్ల మనం దానిలో మునిగిపోతాం. ముఖ్యంగా సూర్యను చూస్తూ ఉండిపోతాం.

సంగీత దర్శకుడు జి.వి. ప్రకాష్ కుమార్ మరోసారి తన ప్రతిభను చాటుకున్నారు. నేపథ్య సంగీతం ద్వారా కూడా కథను చెప్పే ప్రయత్నం చేశాడతను. ఎమోషనల్ సన్నివేశాలను అతను నేపథ్య సంగీతంతో ఎలివేట్ చేసిన తీరు తన ప్రత్యేకతను చాటుతుంది. పాటలు జస్ట్ ఓకే అనిపిస్తాయి. ఇక తెలుగు డబ్బింగ్ కూడా ప్రత్యేక ఆకర్షణ. టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్.. సూర్యకు డబ్బింగ్ చెప్పారు. సినిమా ప్రారంభంలో కొత్తగా అనిపించినా.. అలా చూసేకొద్ది నిజంగా సూర్య మాట్లాడుతున్నారేమో అనిపిస్తుంది. అంతబాగా సత్యదేవ్ డబ్బింగ్ చెప్పారు.

నికేత్ బొమ్మి కెమెరా పనితనం సినిమాకు మరో ఎసెట్. విజువల్స్ ఆద్యంతం ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువల విషయంలో సూర్య ఎక్కడా రాజీ పడలేదు. ఇక దర్శకురాలు సుధ కొంగర.. ఎంచుకున్నది వాస్తవ కథే అయినా దాన్ని స్క్రీన్ మీదికి తీసుకురావడంలో చేసిన కృషి తెరపై కనిపిస్తుంది. ఇక అపర్ణ బాలమురళికి చెప్పించిన డబ్బింగ్ కూడా బాగా కుదిరింది. దర్శకురాలిగా ఆమెకు ఓవరాల్ గా మంచి మార్కులు పడతాయి.

చివరిగా.. ‘ఆకాశం నీ హద్దురా!’.. ఎమోషనల్  అలాగే  కలలకు హద్దులు లేవు అని చెప్పే కథ…

 

Related Articles

Telugu Articles

Movie Articles

మూవీ రివ్యూ : ఆకాశం నీ హద్దురాSurya Aakaasam Nee Haddhu Raa Movie OTT Review Rating..