tamannaah gets emotional and says her experience with corona

Tamannaah: ఇటీవలే తమన్నా కరోనా బారినపడి కోలుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం తన సినిమా షూటింగ్స్‌తో బిజీగా ఉన్న ఆమె.. తాజాగా కోవిడ్ సమయంలో తాను ఎదుర్కొన్న పరిస్థితుల గురించి, ఆ తర్వాత తన ఫోటోలు చూసి నెటిజన్స్ రియాక్ట్ అయిన తీరు గురించి వివరించింది. తనకు కరోనా సోకిందనే విషయం తేలియాగానే కంగారు పడ్డానని, పైగా తనలో కోవిడ్ లక్షణాలు ఎక్కువగా కనిపించడంతో చనిపోతానేమో అని భయమేసిందని తమన్నా చెప్పింది. ఆ సమయంలో వైద్యులు సరైన ట్రీట్‌మెంట్ ఇచ్చి తనను కాపాడారని ఆమె పేర్కొంది. ఆ విషయాన్ని తాజా ఇంటర్వ్యూలో వెల్లడించింది.

ఇకపోతే కోవిడ్ సమయంలో తనకు అండగా నిలుస్తూ సపోర్ట్ చేసిన తల్లిదండ్రులకు, డాక్టర్లకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పింది తమన్నా. ఆ సమయంలోనే తనకు జీవితం విలువ తెలిసిందని చెప్పిన మిల్కీ బ్యూటీ.. కోవిడ్ లక్షణాలు తీవ్రతరం అవ్వడంతో చాలా ఇబ్బంది పడ్డానని ఆ సమయంలో తనకు చనిపోతాననే ఆలోచనలు వెంటాడాయని కూడా తెలిపింది. కోవిడ్ నుంచి కోలుకున్నాక కొందరు నెటిజన్స్ చేసిన కామెంట్స్ తీవ్రంగా బాధపెట్టాయని తెలిపింది.

రీసెంట్‌గా సోషల్ మీడియాలో ఓ ఫొటో షేర్ చేస్తే అది చూసి చాలా మంది లావుగా ఉన్నావని కామెంట్స్ పెట్టడం చూస్తే వాళ్ళ విజ్ఞత ఏంటనేది అర్థమవుతోందని తమన్నా వాపోయింది. పరిస్థితి ఎలాంటిది? అనేది తెలుసుకోకుండా కొంతమంది ఇలా మాట్లాడుతుంటారని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ భామ గోపీచంద్ సరసన సీటీమార్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. నితిన్ సరసన అంధాధున్ లో నటించనుంది. అలాగే గుర్తుందా సీతాకాలం లోనూ నటిస్తోంది.