Tamil Hero Dhanush May Play Role In Rajinikanth Biopic

Rajinikanth Biopic: బాలీవుడ్‌తో పాటు ఇతర భాషల్లోనూ ఇప్పుడు బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. వివిధ రంగాల్లో రాణించిన ప్రముఖుల జీవితాలను తెరకెక్కించేందుకు దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తుండగా.. ప్రేక్షకులు సైతం బాగానే ఆదరిస్తున్నారు. మహానటి సావిత్రి బయోపిక్‌ ఘనవిజయం సాధించడంతో సౌత్‌లో కూడా బయోపిక్‌లు ఊపందుకున్నాయి. ఈ క్రమంలోనే సౌత్ సూపర్‌స్టార్ రజినీకాంత్ జీవిత కథను తెరకెక్కేందుకు ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ఇండియాలోనే కాదు. జపాన్ మలేషియా వంటి దేశాల్లో కూడా డై హార్డ్ ఫ్యాన్స్. ఆయన కున్న చరిష్మా దేశంలోనే మరే హీరోకు లేదంటే అతిశయోక్తి కాదేమో.

మూడేళ్ల కిందట రాజకీయాల్లోకి వస్తున్నట్టు రజనీ ప్రకటించగా ఎన్నికల వేళ పార్టీ పెట్టాలనుకుంటున్న సమయంలో కరోనా ఉధృతి ఆయన రాజకీయ ప్రవేశాన్ని అయోమయంలోకి నెట్టింది. అసలు రాజకీయాల్లోకి రావాలా.. వద్దా.. అనే విషయమై ఆయన తొందర్లోనే క్లారిటీ ఇవ్వనున్నారు.ప్రముఖ దర్శకుడు, రజినీకాంత్‌ అభిమాని అయిన లింగుస్వామి సూపర్‌స్టార్ బయోపిక్‌ తీసేందేకు సన్నాహాలు చేస్తున్నారట. ఇందులో రజినీకాంత్‌గా ఆయన పెద్దల్లుడు ధనుష్ నటించనున్నట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ప్రాజెక్ట్‌పై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

తొలినాళ్లలో బస్ కండక్టర్‌గా పనిచేసిన రజినీకాంత్ కె.బాలచందర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అపూర్వ రాగన్‌గల్‌’ సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చారు. తెలుగు, తమిళ్‌, హిందీ, కన్నడ భాషలతో పాటు పలు అమెరికన్ సినిమాల్లోనూ మెరిశారు. సామాన్య వ్యక్తి నుంచి సూపర్‌స్టార్‌గా ఎదిగిన ఆయన జీవితంలో ఓ సినిమాకు కావాల్సిన మలుపులన్నీ ఉన్నాయి. ప్రస్తుతం ఈ వార్త కోలీవుడ్ లో సంచలనంగా మారింది. ఈ వార్త విన్న రజనీ ఫ్యాన్స్ అయితే తెగ సంబరాలు చేసుకుంటున్నారు. మామ బయోపిక్ ని అల్లుడు చేయడం అదిరింది అని అంటున్నారు.