ప్రముఖ నటుడు సోనూ సూద్ పేరిట హైదరాబాద్‌లో ఉచిత అంబులెన్స్ సర్వీస్ ప్రారంభమైంది. హైదరాబాద్ ప్రజలకు సుపరిచితమైన ట్యాంక్ బండ్ శివ ఈ ఉచిత అంబులెన్స్ సర్వీసును నడపనున్నారు. ఈ అంబులెన్స్ సర్వీస్‌ను నటుడు సోనూ సూద్ స్వయంగా మంగళవారం ట్యాంక్ బండ్‌పై ప్రారంభించారు. కరోనా కష్టకాలంలో వలస కూలీలకు సాయం చేసిన సోనూసూద్.. అప్పటి నుండి ఆపదలో ఉన్న పేదలకు అండగా నిలుస్తూ తన సేవలను కొనసాగిస్తున్నారు.
ఈ అంబులెన్స్ ద్వారా జంట నగరాల్లోని పేద ప్రజలకు సేవలు అందించనున్నారు ట్యాంక్ బండ్ శివ. దాతల సహాయంతో ఈ అంబులెన్స్‌ను కొనుగోలు చేశానని, తనకు స్ఫూర్తి ప్రదాత అయిన సోనూ సూద్ పేరును ఈ అంబులెన్స్‌కు పెట్టుకున్నానని శివ వెల్లడించారు. ఇటీవల కొన్నివాహనాలను కొనుగోలు చేసి, వాటిని అంబులెన్స్ లుగా మార్చి ప్రజలకు సాయపడేందుకు సిద్దమయ్యాడు. రానున్న రోజులలో వీటిని మరింత విస్తృతం చేస్తామని సోనూసూద్ అంటున్నాడు.