సినీ పరిశ్రమకు వరాలు…టిక్కెట్ ధరలు పెంచుకోవచ్చు: కె.సి.ఆర్

0
389
Telangana Cm KCR Announces Subsidies To Telugu Film Industry

కరోనా కారణంగా ప్రపంచమంతా కుదేలైంది. అన్ని రంగాలతో పాటు సినీ పరిశ్రమ తీవ్రంగా నష్టపోయింది. తెలుగు సినీ పరిశ్రమపై తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు (కేసీఆర్) వరాల జల్లు కురిపించారు. అయితే కోవిడ్ మహమ్మారి కారణంగా తెలుగు చిత్రసీమ దాదాపు తొమ్మిది నెలల పాటు స్తంభించిపోయింది. టీఆర్ఎస్ జీహెచ్ఎంసీ ఎన్నికల మానిఫెస్టో విడుదల కోసం సోమవారం కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ సినీ పరిశ్రమను ఆదుకోవడం కోసం తీసుకోబోతున్న చర్యలను వివరించారు.

అన్ లాక్ ప్రక్రియలో భాగంగా ఇప్పుడిప్పుడే పలు నిబంధనలతో షూటింగులకు ప్రభుత్వ అనుమతులు లభించాయి. ముంబై, చెన్నై, హైదరాబాద్.. ఈ మూడు ప్రాంతాలు చిత్ర పరిశ్రమకు ఆయువుపట్టుగా ఉన్నాయని కేసీఆర్ అన్నారు. తెలుగు సినీ పరిశ్రమలో దాదాపుగా 40 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారని.. వీరిలో 16 వేల మంది జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారన్నారు. పరిశ్రమనే నమ్ముకున్న వేలాదిమంది కార్మికులకు ఉపాధి లేక విలవిలలాడిపోయారు. సినీ పరిశ్రమ పూర్తిగా పనిచేయడం ఆగిపోయింది కాబట్టి రోజువారీ వేతనానికి పనిచేసే కార్మికుల పరిస్థితి దారుణంగా మారిందని కేసీఆర్ చెప్పారు. ఈ 40 వేల మంది సినీ కార్మికులకు హెల్త్ కార్డులు, రేషన్ కార్డులు సహా సామాన్య ప్రజలకు అందించే అన్ని సదుపాయాలు అందిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు.

అలాగే, సినిమా థియేటర్లు కరెంట్ బిల్లులు రద్దు చేస్తున్నామని కేసీఆర్ స్పష్టం చేశారు. మరోవైపు, రూ.10 కోట్ల లోపు బడ్జెట్‌తో నిర్మించే సినిమాలకు రాష్ట్ర జీఎస్టీ 9 శాతాన్ని రీఎంబర్స్‌మెంట్ చేయనున్నట్టు కేసీఆర్ వెల్లడించారు. పెద్ద సినిమాలు విడుదలైనప్పుడు పరిమితి లేకుండా షోలు వేసుకోవడానికి థియేటర్లకు అనుమతులు ఇస్తామని కేసీఆర్ చెప్పారు. అలాగే, టిక్కెట్ ధరలను సవరించుకునే వెసులుబాటు కూడా కల్పిస్తామన్నారు. అయితే, థియేటర్లు తెరవడం ద్వారా కరోనా వ్యాప్తి కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత సినీ పరిశ్రమదేనని కేసీఆర్ అన్నారు. థియేటర్లను డిసెంబర్ నుంచి తెరుచుకుంటారో లేదంటే సంక్రాంతికి తెరుస్తారో వారి ఇష్టం అని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here