telangana high court gave permission to release for RGV murder movie release

RGV murder movie: వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న ‘మర్డర్’ సినిమాకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ప్రణయ్, అమృతల ప్రేమపెళ్లి, ప్రణయ్ హత్య, మారుతీరావు ఆత్మహత్య కథాంశంతో నిర్మిస్తున్న ఈ సినిమాను నిలిపివేయాలంటూ అమృత నల్గొండ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అమృతను నెగటివ్ షేడ్స్ తో వర్మ చూపించినట్లుగా ప్రోమో మరియు ఫొటోలను చూస్తుంటే అనిపిస్తుంది అంటూ నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై వాద ప్రతివాదనలు విన్న నల్గొండ కోర్టు ‘మర్డర్’ సినిమాపై స్టే విధించింది.

దీంతో చిత్ర యూనిట్ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు నల్గొండ న్యాయస్థానం ఇచ్చిన స్టేను కొట్టివేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పుడు వర్మకు అనుకూలంగా హైకోర్టులో తీర్పు రావడంతో సినిమా విడుదలకు సిద్దం చేస్తున్నట్లుగా వర్మ సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. అయితే సినిమాలో అమృత, ప్రణయ్ పేర్లు ఎక్కడా వాడకూడదంటూ షరతు విధించింది. ఈ చిత్రంలో నిజజీవితాలను తలపించే విధంగా సన్నివేశాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది. త్వరలో పూర్తి వివరాలను వెళ్లడిస్తామంటూ అందరికి వర్మ కృతజ్ఞతలు తెలియజేశాడు. ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేస్తాడా లేదంటే ఓటీటీ ద్వారా విడుదల చేస్తాడా అనే విషయమై అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.