రివ్యూ: సత్యదేవ్‌ తిమ్మరుసు

0
1434
Thimmarusu Telugu Movie Review Rating

Thimmarusu Telugu Movie Review Rating
విడుదల తేదీ : జూలై 30, 2021
రేటింగ్ : 3/5
నటీనటులు : సత్యదేవ్, ప్రియాంక జవాల్కర్, బ్రహ్మాజీ, వైవా హర్ష, రవిబాబు, అంకిత్ మరియు అజయ్
దర్శకుడు: శరణ్ కొప్పిశెట్టి
నిర్మాతలు : మహేష్ కోనేరు, సృజన్ యరబోలు
సంగీత దర్శకుడు : శ్రీచరణ్ పాకాల
ఎడిటర్: తమ్మి రాజు

లాక్ డౌన్-2 విరామం తర్వాత ఎట్టకేలకు మళ్లీ థియేటర్లు తెరుచుకున్నాయి. వెండితెరల్లో తిరిగి వెలుగులు నింపుతున్న చిత్రాల్లో ‘తిమ్మరసు’ ఒకటి. ప్రేక్ష‌కుల స్పంద‌న ఎలా ఉంటుందా? అని ప‌రిశ్ర‌మ మొత్తం ఈ సినిమా విడుద‌ల కోసం ఆస‌క్తిగా ఎదురు చూసింది. మంచి క‌థ‌ల్ని ఎంచుకుంటూ… మంచి పాత్ర‌ల్లో ఒదిగిపోయే స‌త్య‌దేవ్ క‌థానాయ‌కుడిగా న‌టించ‌డంతో ఈ సినిమాపై ప్రేక్ష‌కుల్లోనూ మంచి అంచ‌నాలే ఏర్ప‌డ్డాయి. మ‌రి చిత్రం అందుకు త‌గ్గ‌ట్టు ఉందో లేదో తెలుసుకునే ముందు క‌థేమిటో చూద్దాం!

కథ: అరవింద్ అనే క్యాబ్ డ్రైవర్ (చైతన్య)ను ఎవరో హత్య చేస్తారు. కానీ వాసు అనే కుర్రాడ్ని ఆ హత్యలో ఇరికించి ఎనిమిదేళ్ళు శిక్ష విధిస్తారు. ఆ కేసును లాయర్ రామచంద్ర (సత్యదేవ్) మళ్లీ రీఓపెన్ చేసి.. వాసు ఏ తప్పు చేయలేదని ప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో రామచంద్రకి ఎదురైన సంఘటనలు, సమస్యలు ఏమిటి ? రామచంద్ర వాటిని ఎలా ఎదుర్కొన్నాడు ? ఈ ప్రాసెస్ లో అతని లవర్ లాయర్ అను (ప్రియాంక), సుధాకర్ (బ్రహ్మజీ) అతనికి ఎలాంటి సాయం చేశారు ? ఇంతకీ క్యాబ్ డ్రైవర్ ను హత్య చేసింది ఎవరు ? అసలు క్యాబ్ డ్రైవర్ అరవింద్ కి, రామచంద్రకి మధ్య ఉన్న సంబంధం ఏమిటి ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ సినిమాని చూడాల్సిందే.

తిమ్మరుసు సినిమా పై మీ అభిప్రాయం ఏమిటి..?

 

నటీనటులు:
సత్యదేవ్ ప్రతిభ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఏ పాత్ర ఇచ్చినా దానికి పూర్తి న్యాయం చేయడానికి చూస్తాడు. లాయర్ రామచంద్ర పాత్రలోనూ అతను సిన్సియర్ పెర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నాడు. ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ పాత్రకు మిస్ ఫిట్ అనిపిస్తుంది. మరీ మోడర్న్ గా అనిపించే ఆమె లుక్స్ ఈ పాత్రకు సరిపోలేదు.

అజ‌య్ అల‌వాటైన పాత్ర‌లో ఒదిగిపోయాడు. అమాయ‌క కుర్రాడిగా అంకిత్ న‌ట‌న బాగుంది. సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది. మెయిన్ విలన్ గా చేసిన కొత్త నటుడి గురించి పెద్దగా చెప్పుకోవడానికేమీ లేదు. ‘30 వెడ్స్ 21’ ఫేమ్ చైతన్యరావు.. ఝాన్సీ.. అజయ్.. ప్రవీణ్.. హర్ష.. బాలకృష్ణన్.. వీళ్లంతా బాగానే చేశారు.

టెక్నికల్ గా చూసుకుంటే సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ బాగానే ఉంది. నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ ఆయింది. అదే విధంగా సినిమాటోగ్రఫీ సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. అప్పు ప్రభాకర్ ఛాయాగ్రహణం సినిమా శైలికి తగ్గట్లు సాగింది. ఆరంభం నుంచే ఒక మూడ్ క్రియేట్ చేయడంలో కెమెరామన్ కీలక పాత్ర పోషించాడు.

విశ్లేషణ: క‌థానాయ‌కుడు న్యాయ‌వాది అన‌గానే ఇదొక కోర్టు రూమ్ డ్రామా అనుకుంటాం. పైగా ఇప్పుడు ఆ క‌థ‌ల ట్రెండ్ కూడా న‌డుస్తోంది. అయితే ఇందులో కోర్టు రూమ్ డ్రామా కంటే కూడా నేర నేప‌థ్య‌మే ఎక్కువ‌గా ఉంటుంది. కన్నడలో విజయవంతమైన ఓ సినిమాను తీసుకుని.. మాతృకలోని ఆసక్తిని ఏమాత్రం తగ్గనివ్వకుండా.. ఆద్యంతం ఎంగేజింగ్ గా తీర్చిదిద్దింది శరణ్ కొప్పిశెట్టి అండ్ కో. ఆరంభంలో మామూలు సినిమాలా అనిపించినా.. ముందుకు సాగే కొద్దీ ఉత్కంఠభరిత మలుపులు తిరుగుతూ.. ప్రేక్షకులను థ్రిల్ చేస్తూ.. చివరికి మంచి సినిమా చూసిన అనుభూతిని మిగులుస్తుందీ చిత్రం.

అస‌లు క‌థ‌లోకి వెళ్ల‌డానికి మాత్రం చాలా స‌మ‌య‌మే తీసుకున్నాడు ద‌ర్శ‌కుడు. స‌హ‌జంగా ఒక కేసుని చేప‌ట్టాక దాని పూర్వప‌రాల‌న్నీ కూలంక‌షంగా తెలుసుకుని రంగంలోకి దిగుతాడు న్యాయ‌వాది. త‌న తెలివి తేట‌ల‌తో ప‌ని మొద‌లు పెడ‌తాడు. ఇందులో మాత్రం న్యాయ‌వాది ప్ర‌తి ప‌ది నిమిషాల‌కి ఓ విష‌యం తెలుస్తుంటుంది. ఇది ముందే ఎందుకు చెప్ప‌లేదని బాధితుడిని అడుగుతుంటాడు. ఆ స‌న్నివేశాలు ఏమాత్రం ఆస‌క్తి లేకుండా సాగుతున్న‌ట్టు అనిపిస్తాయి.

ఐతే కేసులో హీరో సీరియస్ గా ఇన్వాల్వ్ అయి లోతుగా పరిశీలించడం మొదలుపెట్టాక.. ఒక్కో చిక్కుముడి వీడుతున్న కొద్దీ ఆసక్తి పెరుగుతుంది. ఇంటర్వెల్ దగ్గర మంచి ట్విస్టుతో ద్వితీయార్ధంపై క్యూరియాసిటీ పెరుగుతుంది. ‘తిమ్మరసు’కు పెద్ద బలం రెండో అర్ధమే. ఇంటర్వెల్ తర్వాత నుంచి కథనం ఎక్కడా ఆగకుండా పరుగులు పెడుతుంది.

సాక్ష్యాల్ని సేక‌రిస్తున్న‌ కొద్దీ, వాటిని హంతకుడు మాయం చేయ‌డం క‌థ‌లో లీన‌మ‌య్యేలా చేస్తుంది. ద్వితీయార్ధంలో క‌థలోని పార్శ్వాలు ఆక‌ట్టుకుంటాయి. ఈ కేసుకీ, క‌థానాయ‌కుడి వ్య‌క్తిగ‌త జీవితానికీ ముడిపెట్టిన తీరు మ‌రింత‌గా మెప్పిస్తుంది. ప‌తాక స‌న్నివేశాలు చిత్రానికి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తాయి.

 

REVIEW OVERVIEW
CB Desk
Previous articleపవర్‌స్టార్‌ పెయిర్‌ ఫిక్స్‌ #PSPKRanaMovie
Next articleనరసింహపురం రివ్యూ