Tollywood Actor Prince Cecil booked under Drunk and Drive
Tollywood Actor Prince Cecil booked under Drunk and Drive

మద్యం మత్తులో జరిగే ప్రమాదాలు అన్నీ.. ఇన్నీ కావు..! హైదరాబాద్ మహా నగరిలో ఇప్పటికే మద్యం తాగి రోడ్డుపై వాహనాలతో వచ్చే వాళ్ళను పోలీసులు ఊరికే వదలడం లేదు. ఎంతో మంది సెలెబ్రిటీలను కోర్టు మెట్లు ఎక్కించారు. తప్పించుకోడానికి ప్రయత్నించి మీడియా కంటికి చిక్కిన వాళ్ళు కూడా చాలా మందే ఉన్నారు. తాజాగా మరో టాలీవుడ్ సెలెబ్రిటీ కూడా పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. కానీ కాస్త ఆలస్యంగా ఈ విషయం బయటకు వచ్చింది. ఇంతకూ ఆ టాలీవుడ్ సెలెబ్రిటీ ఎవరనే కదా మీ డౌట్.. హీరో ప్రిన్స్.

సినీ హీరో ప్రిన్స్ డ్రంకెన్ డ్రైవ్ లో దొరికినట్లు తెలుస్తోంది. బాచుపల్లిలోని వీఎన్ఆర్ కాలేజీ వద్ద డ్రంకెన్ డ్రైవ్ లో దొరికాడు. ఈ నెల 24న ఇది జరిగినప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డ్రంకెన్ డ్రైవ్ కేసు నేపథ్యంలో కూకట్ పల్లి 4వ మెట్రోపాలిటన్ స్పెషల్ కోర్టుకు ప్రిన్స్ హాజరయ్యాడు. కోర్టుకు ఏకంగా రూ. 5 వేల జరిమానా విధించినట్లు తెలుస్తోంది. అయితే ఇది చాలా తక్కువేనట..! ప్రిన్స్ డ్రంకెన్ డ్రైవ్ లో తొలిసారి పట్టుబడటంతో కేవలం తక్కువ జరిమానాతోనే సరిపెట్టినట్లు తెలుస్తోంది. తెలుగులో తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ‘నీకు నాకు డాష్ డాష్’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు ప్రిన్స్‌. బస్‌ స్టాప్‌ సినిమాతో సక్సెస్‌ అందుకున్నా ఆ తర్వాత వరుస ఫ్లాప్‌లు ఎదురుకావటంతో కొన్ని సినిమాల్లో మంచి క్యారెక్టర్లు చేస్తూ కనిపించాడు. నాని వ్యాఖ్యతగా వ్యవహరించిన బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌ 2లో కంటెస్టంట్‌గానూ కనిపించడంతో ఫుల్ పాపులారిటీ లభించింది.

అయినా సెలెబ్రిటీ అన్నాక పది మందికి ఆదర్శంగా ఉండాలి. ఏ డ్రైవర్ నో.. ఆన్ లైన్ లో క్యాబ్ బుక్ చేసుకోవడంతోనో సమస్యను పరిష్కరించుకోవచ్చు.. కానీ వీళ్ళు మాత్రం ఫుల్ గా తాగి పోలీసుల చెకింగ్ లో దొరికిపోతున్నారు. పొరపాటున మద్యం మత్తులో జరగరానిది జరిగితే అందరూ బాధపడాల్సి ఉంటుంది.