Tollywood Celebs Responds on About Priyanka Reddy.
Tollywood Celebs Responds on About Priyanka Reddy.

వైద్యురాలు ప్రియాంక రెడ్డి హత్యాచారం జరిగిన ఘటనపై టాలీవుడ్ ప్రముఖులు స్పందించారు. ఇది చాలా ఘోరమైన ఘటన అని.. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

ప్రియాంక రెడ్డి హత్యకు గురైన ఘటనపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. శంషాబాద్ హత్య ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని.. మృతురాలి కుటుంబానికి జనసేన తరఫున ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని చెప్పారు. ఆడబిడ్డలపై అఘాయిత్యాలకు పాల్పడేవారిని బహిరంగంగా శిక్షించాలని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ ఘటనపై నటుడు అలీ స్పందించారు.. ఇటువంటి దారుణ ఘటనలు జరగడం బాధాకరమని.. హైదరాబాద్ శివార్లలో ఇలాంటి ఘటనల వల్ల ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతుందని అన్నారు. అంతేకాకుండా నిందితుల తరఫున న్యాయవాదులెవ్వరూ వాదింవవద్దని కోరారు.

నటి అనుష్క శెట్టి కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సమాజంలో మహిళగా పుట్టడమే నేరమా? అని ఆమె ప్రశ్నించారు. ఇలాంటి దారుణాలకు పాల్పడిన వారిని జంతువులతో పోలిస్తే… అవి కూడా సిగ్గుపడతాయని అన్నారు. అమాయకురాలైన ప్రియాంక రెడ్డిని అత్యాచారం చేసి చంపేయడం.. మొత్తం మానవాళిని కదిలించే విషాదకరమైన ఘటన అని చెప్పారు. ఈ దారుణానికి ఒడిగట్టిన వారికి వెంటనే శిక్ష పడే విధంగా మనందరం కలిసి పోరాడుదామని అన్నారు.

లేడీ అమితాబ్ విజయశాంతి ఈ ఘటనపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మదమెక్కిన మగ పిశాచాల దాష్టీకానికి మాతృ హృదయం తల్లడిల్లిపోతోందని.. ఇది సభ్య సమాజానికే తీరని కళంకమన్నారు. కామాంధుల కర్కశానికి ఓ వైద్యురాలు బలైపోయిందన్నారు. తెలంగాణ సమాజానికి ఇది తీరని అవమానమని విజయశాంతి అన్నారు. వరంగల్‌లోనూ అరాచకాలు కొనసాగుతున్నాయన్నారు. సమిధలుగా మారుతున్నది ప్రియాంక, మానసలే కాదని, గొప్పగా చెప్పుకునే మానవత్వం కూడానని ఆవేదన చెందారు. ఇప్పటికైనా ప్రభుత్వం నిద్ర మేల్కొనకపోతే మహిళా ఉద్యమం తథ్యమని అన్నారు. ఇలాంటి ఘాతుకాలకు తెగబడే ముందు అమ్మల కడుపున పుడుతున్న అన్నదమ్ములు ఒక్క క్షణం ఆలోచించాలని విజయశాంతి కోరారు. కని, పెంచిన అమ్మ, తోడబుట్టిన అక్కచెల్లెళ్లు, కడుపున పుట్టిన ఆడబిడ్డలు ఎందుకు గుర్తుకు రావడం లేదని ప్రశ్నించారు.

ప్రియాంకరెడ్డి హత్య ఘటన తనను కలచివేసిందని వైసీపీ నాయకురాలు రోజా చెప్పారు. ఈ కేసులోని నిందితులను బహిరంగంగా ఉరి తీయాలని ఆమె డిమాండ్ చేశారు. ఆడపిల్లపై చేయి వేయాలంటే భయం కలిగేలా శిక్షలు ఉండాలని అన్నారు. కామాంధులకు దుబాయ్ లో వేసే శిక్షలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.

ప్రియాంక తండ్రి పోలీసులను ఆశ్రయించగా, మీ కుమార్తె ఎవరితోనో వెళ్లిపోయుంటుందేమో అని పోలీసులు అన్నారన్న వ్యాఖ్యలపై నటి పూనమ్ కౌర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆపదలో ఉన్న ఓ అమ్మాయిని లేచిపోయిందేమో అనడానికి పోలీసులకు సిగ్గు లేదా? అని ప్రశ్నించారు.