tollywood drugs case investigating officer vivekananda reddy reveals facts

Tollywood Drugs Case: టాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణ కొనసాగుతుందని విచారణాధికారి వివేకానందరెడ్డి వెల్లడించారు. ఇప్పటి వరకు 8 ఛార్జిషీట్లు దాఖలు చేసినట్టు ఆయన తెలిపారు. బాలీవుడ్ డ్రగ్స్ కేసు.. టాలీవుడ్‌లోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. డ్రగ్స్‌ కేసులో రకుల్, నమ్రత పేర్లు బయటికి రావడంతో టాలీవుడ్ సెలబ్రిటీల్లో అలజడి మొదలైంది. టాలీవుడ్ డ్రగ్స్ కేస్ వివరాలను కూడా ఎన్‌సీబీ తీసుకున్నట్టు తెలుస్తోంది. డ్రగ్స్ డీలర్ కెల్విన్‌తో పాటు డ్రగ్స్ వాడిన సెలబ్రిటీల వివరాలను కూడా ఎక్సైజ్‌ శాఖ నుంచి ఎన్‌సీబీ తీసుకుంది. కాగా టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులోనూ సంచలన విషయాలు బయటకొస్తున్నాయి.

అయితే, ఈ కేసులో పూర్తి దర్యాప్తు కోసం ప్రభుత్వం సిట్‌ను నియమించింది. కానీ, ఆ తరవాత ఈ కేసుకు సంబంధించి అప్‌డేట్ లేదు. దీంతో ఇక ఆ కేసు మరుగున పడినట్టే అని అంతా భావించారు. కానీ, ఆ కేసుకు సంబంధించి ఛార్జిషీట్లు సిద్ధం చేశామని.. 72 మంది శాంపిల్స్ ల్యాబ్‌కు పంపామని విచారణాధికారి వివేకానంద రెడ్డి చెప్పుకొచ్చారు. టాలీవుడ్‌తో పాటుగా వ్యాపారవేత్తల శాంపిల్స్‌ని పంపించాము. కొంతమంది టాలీవుడ్ నటులు శాంపిల్స్ ఇవ్వడానికి వెనుకంజ వేశారు. శాంపిల్ ఇచ్చి పునరావాస కేంద్రంలో కౌన్సిలింగ్ పొందిన వారి పేర్లను ఛార్జ్‌షీట్లో పెట్టలేదు.

టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు విచారణ అధికారిగా ఉన్న ఎక్సైజ్ రిటైర్డ్ డిప్యూటీ కమిషనర్ వివేకానందరెడ్డి సాక్షితో పలు విషయాలను వెల్లడించారు. ’12 కేసుల్లో ఉన్న అందరి శాంపిల్స్‌ని సేకరించాము. కొంత మంది నటులు పునరావాస కేంద్రంలో కౌన్సెలింగ్ తీసుకోలేదని, వారి పేర్లను ఛార్జిషీట్లో పొందుపరిచామని తెలిపారు. ఛార్జిషీట్లో ఉన్న వారికి ఏడాది నుంచి రెండు సంవత్సరాల శిక్ష పడుతుందని స్పష్టం చేశారు. మొత్తం 72 మందికి సంబంధించిన శాంపిళ్లను సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపిచామని వివేకానంద రెడ్డి చెప్పారు. విదేశాల నుంచి పెద్ద మొత్తంలో టాలీవుడ్‌కు డ్రగ్స్ సరఫరా అవుతున్నాయి సంచలన ఆరోపణలు చేశారు వివేకానంద.