బాలీవుడ్ మూవీ అప్ డేట్స్ విషయంలో ప్రిన్స్ మహేశ్ బాబు ముందుంటారు. అంతేకాదు… దక్షిణాది భాషా చిత్రాల్లోనూ కాస్తంత కొత్తగా ఏది ఉన్నా… సోషల్ మీడియా ద్వారా తన మనసులోని మాటను ఆయన వ్యక్తం చేస్తుంటారు. తాజాగా ఫర్హాన్ అక్తర్ నటించిన హిందీ సినిమా ‘తూఫాన్’ టీజర్ ను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన మహేశ్ బాబు… ఫర్హాన్ అక్తర్ ను అభినందనలతో ముంచెత్తారు. ‘తూఫాన్’ టీజర్ టెర్రిఫిక్ గా ఉందని చెప్పిన మహేశ్ బాబు… పర్హాన్ అక్తర్ బాక్సర్ గా నటించడం కోసం తన శరీర ఆకృతిని మార్చుకున్న విధానాన్ని ప్రశంసించారు.
ఈ సినిమా చూడటానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు మహేశ్ తెలిపారు. రాకేశ్ ఓంప్రకాశ్ మెహ్రా దర్శకత్వం వహించిన ఈ స్పోర్ట్స్ డ్రామా నిజానికి గత యేడాది గాంధీ జయంతిన థియటర్స్ లో విడుదల కావాల్సింది. కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు మాత్రం అమెజాన్ ప్రైమ్ సంస్థ మే 21న దీనిని స్ట్రీమింగ్ చేస్తోంది. మరి ‘భాగ్ మిల్కా భాగ్’ తర్వాత పర్హాన్ అక్తర్ చేస్తున్న ఈ క్రీడా నేపథ్య చిత్రం ఏ స్థాయి విజయం సాధిస్తుందో చూద్దాం!