మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక సినిమా ‘ఆచార్య’ ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ‘సిద్ద’ అనే కీలక పాత్ర పోషిస్తున్నారు రామ్ చరణ్. సినిమా చిత్రీకరణ నేపథ్యంలో ఎ.వీరవరం, కొత్త అంగుళూరు వద్ద గోదావరి ఒడ్డున ‘ఆచార్య’ పాట చిత్రీకరణ చేశారు. చిత్రీకరణలో భాగంగా రామ్చరణ్ దంపతులు సందడి చేశారు.
అటవీ ప్రాంతంలో రామ్ చరణ్- ఉపాసన జోడీని చూసేందుకు జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. వారందరికీ అభివాదం తెలిపిన ఉపాసన.. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం లోని పాఠశాల విద్యార్థులతో కాసేపు మాట్లాడింది. అనంతరం వారితో సరదాగా సెల్ఫీలు దిగుతూ ఎంజాయ్ చేసింది. ఆచార్య సినిమా విషయానికొస్తే.. మెగాస్టార్ 152వ సినిమాగా దర్శకుడు కొరటాల శివ సామాజిక కోణంలో ఈ మూవీ రూపొందిస్తున్నారు.
చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. రీసెంట్గా విడుదలైన ఈ చిత్ర టీజర్ భారీ రెస్పాన్స్ తెచ్చుకుంది. చిత్రాన్ని మే నెల 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై నిరంజన్ రెడ్డి, రామ్చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.