సమీక్ష : ఉప్పెన

విడుదల తేదీ : ఫిబ్రవరి 12, 2021
రేటింగ్ : 3.25/5
నటీనటులు : పంజా వైష్ణ‌వ్ తేజ్‌, విజ‌య్ సేతుప‌తి, కృతి శెట్టి
దర్శకత్వం : బుచ్చిబాబు సానా
నిర్మాత‌లు : న‌వీన్ ఎర్నేని, వై. ర‌విశంక‌ర్
సంగీతం : దేవి శ్రీ‌ప్ర‌సాద్‌
సినిమాటోగ్రఫీ : షామ్‌ద‌త్ సైనుద్దీన్‌

మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన మరో హీరో ‘వైష్ణవ్ తేజ్’.. అతడు హీరోగా తొలిపరిచయం అనగానే అభిమానుల్లో కాస్త ఆసక్తి ఉంటుంది. కరోనా లాక్ డౌన్ కంటే ముందే విడుదలవ్వాల్సిన సినిమా.. మధ్యలో ఓటీటీలో విడుదల అవుతుందంటూ ప్రచారం కూడా సాగింది.

కానీ మెగా హీరో తొలిపరిచయం కావడంతో సినిమాను థియేటర్ లోనే రిలీజ్ చేయాలని అనుకున్నారు. అనుకున్నట్లుగానే ఈ సినిమా శుక్రవారం రిలీజ్ అయ్యింది. సినిమాలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఉండడంతోనే సినిమా మీద పాజిటివ్ వైబ్స్ వచ్చాయి. సాంగ్స్ కూడా హిట్ అవ్వడంతో సినిమా మీద అంచనాలు మరింత పెంచేశాయి. అందుకు తగ్గట్టుగా ప్రమోషన్స్ కూడా బాగా చేయడంతో ఉప్పెన మీద సినీ అభిమానులకు క్యూరియాసిటీని పెంచేసింది.

కథ:
ఉప్పాడ మత్య్సకార కుటుంబానికి చెందిన యువకుడు ఆశీ అలియాస్ ఆశీర్వాదం(పంజా వైష్ణవ్‌ తేజ్‌). తండ్రితో పాటూ చేపలు పట్టడమే అతడికి పని. ఆయనకు గ్రామ పెద్ద, వ్యాపారవేత్త రాయణం(విజయ సేతుపతి) కూతురు బేబమ్మ అలియాస్‌ సంగీత(కృతి శెట్టి)ను చిన్నప్పటి నుంచి ప్రేమిస్తుంటాడు. ఆ విషయాన్ని చెప్పలేక పోతూ అలా జీవనం సాగిస్తూ ఉంటాడు. బేబమ్మకు ఇంట్లో ప్రేమ తక్కువ..!

రాయణంకు పరువు అంటే ప్రాణం. పరువు పరువు కోసం ఎంతకైనా తెగిస్తూ ఉంటాడు. తన కూతురు కోసం స్పెషల్‌గా గ్రామానికి ఓ బస్సును కూడా వేయిస్తాడు. కొన్ని కారణాల వల్ల బేబమ్మ.. ఆశీతో ప్రేమలో పడిపోతుంది. ఆ ప్రేమను దాయాలని అనుకున్నప్పటికీ ఆమెకు పెళ్లి నిశ్చయం అయ్యే సమయానికి విషయం తెలిసిపోద్ది.

ప్రేమలో పడిన కూతురు బేబమ్మను కంట్రోల్ చేయడానికి చాలానే ప్రయత్నిస్తాడు.. కానీ బేబమ్మ ఆశీతో కలిసి లేచిపోతుంది. ఆశీలో ప్రేమ ఉన్నా.. ఓ బలమైన కారణం వలన బేబమ్మ తనకు వద్దు అని అనుకుంటాడు. బేబమ్మను ఆశీ ఎందుకు తిరిగి అప్పగించాడు? తిరిగి బేబమ్మ ఆశీ దగ్గరకు చేరిందా..? వారి ప్రేమను రాయణం ఒప్పుకున్నాడా అన్నదే సినిమా కథ.

- Advertisement -

నటీనటులు:
సినిమాలో విజయ్ సేతుపతి ఉన్నాడు అంటే చాలు.. క్యూ కడతారు ప్రేక్షకులు.. పెద్ద నిడివి కలిగిన పాత్ర ఈ సినిమాలో సేతుపతి చేశాడు. రాయణం పాత్రలో సేతుపతి జీవిస్తాడు. కానీ ఇంకా ఏదో సేతుపతి నుండి మిస్ అయినట్లుగా అనిపిస్తుంది.

వైష్ణవ్ తేజ్‌ ఆశి అనే ఓ పేదింటి కుర్రాడి క్యారెక్టర్‌ చేసినా.. మరీ అంత గొప్ప నటన అయితే కనబరచలేదు. కొన్ని కొన్ని సీన్లలో మాత్రమే ఎమోషన్స్ ను క్యారీ చేయగలిగాడు వైష్ణవ్ తేజ్.

ఇక కృతి శెట్టి చాలా బాగా చేసింది. హీరోయిన్ గా తొలి సినిమాయే అయినా.. చాలా అనుభవం ఉన్న హీరోయిన్‌లా నటించింది. మిగిలిన క్యారెక్టర్లు కూడా పర్వాలేదని పించాయి.

విశ్లేషణ:
గొప్పింటి అమ్మాయిని.. పేదింటి అబ్బాయి ప్రేమించడం.. ఆ తర్వాత అమ్మాయి తండ్రి ఒప్పుకోకపోవడం..! కుదిరితే తండ్రిని ఎదిరించడం.. లేదంటే పరువు హత్యలకు పాల్పడడం వంటి సినిమాలు చాలానే వచ్చాయి. ఆ ‘చాలా’ కోవలోకి ఉప్పెన వెళ్లకుండా కథలో కొత్తదనాన్ని చూపించాడు దర్శకుడు బుచ్చిబాబు. విజయ్ సేతుపతి క్యారెక్టర్ ను మలచిన తీరు కూడా అందరికీ నచ్చుతుంది. ముఖ్యంగా సినిమా అన్నది బోర్ కొట్టకుండా అలా ముందుకు సాగిపోతూ ఉండడం ప్లస్ గా మారింది. అనవసరమైన సీన్లు కూడా లేకుండా చూసుకున్నారు.

ఎక్కడో ఈ సీన్ చూసినట్లుగా అనిపించినా కూడా కథలో భాగంగా ముందుకు వెళుతూ ఉంటుంది. సినిమాలో ఉన్న సీక్రెట్ కాస్తా సోషల్ మీడియా కారణంగా వైరల్ అయిపోయింది. అది తెలియకుండా ఉంటే మాత్రం కాస్త కొత్తగా అనిపించవచ్చు. సినిమాకు సంగీతం బాగా ప్లస్ అయ్యింది. శ్యామ్ దత్ విజువల్స్‌.. నవీనూలి ఎడిటింగ్‌ బాగుంది. ఇక సినిమా క్లెమాక్స్ కొత్తగా ఉండడంతో ప్రేక్షకుల్లో కొన్ని విభిన్న అనుభూతులు వస్తాయి. స్క్రీన్ ప్లే విషయంలో ఇంకొన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే సినిమా మరింత బాగుండేది. ఏది ఏమైనా కానీ ఉప్పెన నిరాశ అయితే కలిగించదు.. తమిళ వాసనలు ఉన్నట్లు అనిపించినా కాస్త కొత్తగానూ.. వింతగానూ అనిపించవచ్చు.

ప్లస్ పాయింట్స్ :
విజయ్‌ సేతుపతి, కృతిశెట్టి నటన
స్క్రీన్‌ప్లే
సంగీతం

మైనస్‌ పాయింట్‌
రోటీన్‌ స్టోరీ
ఎక్కడో చూసినట్లుగా అనిపించే సీన్లు
కొందరికి ట్విస్ట్ రుచించవచ్చు/ రుచించకపోవచ్చు

Show comments

Related Articles

Telugu Articles

Movie Articles