మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ తొలి సినిమా ‘ఉప్పెన’ విడుదల కాకముందే రెండో సినిమా కూడా పూర్తి చేసేశాడు. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో వైష్ణవ్ సరసన రకుల్‌ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటించింది. ప్రముఖ రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన `కొండపొలం` నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించారు. క్రిష్ పక్కా ప్లాన్‌తో కేవలం 45 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేశారు. ఎక్కువ భాగం వికారాబాద్ అటవీ ప్రాంతంలోనే తెరకెక్కించారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
సినిమాకి టైటిలే సగం బలం. సక్సెస్ కి ప్రధాన ఆయుధంగా ఉపయోగపడుతుంది. అందుకే టైటిల్ ఎంపిక విషయంలో చాలా సమయం శ్రద్ధ తీసుకుంటారు. సెన్సిటివ్ సినిమాల దర్శకుడు క్రిష్ తన సినిమా టైటిల్ ఎంపిక విషయంలో అంతే ఆచితూచి అడుగులు వేస్తారన్న సంగతి తెలిసిందే. అలాగే తన టైటిల్లో తెలుగుదనానికి పెద్ద పీట వేస్తారాయన. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఇంట్రస్టింగ్ అప్డేట్ బయటికి వచ్చింది. అదేంటంటే.. ఈ సినిమాకు ‘కొండపొలం’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.
నవల పేరునే ఈ సినిమాకు ఫిక్స్ చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై యూనిట్ త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ విలేజ్ గాళ్ పాత్రలో కనిపిస్తుంది. వైష్ణవ్ తేజ్ పల్లె యువకుడిగా కనిపిస్తారట. ప్రస్తుతానికి మూవీ పోస్ట్ ప్రొడక్షన్ జోరందుకుంది. సాధ్యమైనంత తొందరలోనే మూవీని రిలీజ్ చేయనన్నారు.