బాలు కోలుకుంటాడన్న ఆశ కనిపించడం లేదు: కన్నీళ్లు పెట్టుకున్న భారతీరాజా
బాలు కోలుకుంటాడన్న ఆశ కనిపించడం లేదు: కన్నీళ్లు పెట్టుకున్న భారతీరాజా

SPB Health Updates: గాన గంధర్వ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం మరింత విషమించింది. ఎస్పీబీ చికిత్సకు సహకరించడం లేదని వైద్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో దర్శకుడు భారతీరాజా ఎంజీఎం ఆసుపత్రికి చేరుకున్నారు. అక్కడ ఎస్పీబీ సతీమణి సావిత్రి, కుమారుడు చరణ్‌తో మాట్లాడారు. అనంతరం బయటకు వచ్చిన భారతీరాజా.. మీడియా ముందు మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. బాలు కోలుకుంటాడన్న ఆశ కనిపించడం లేదని ఆయన భావోద్వేగానికి గురయ్యారు.

”మృత్యువుతో పోరాడి ఎస్పీబీ తిరిగి వస్తాడని అందరం ఎదురుచూశాము. రోజురోజుకు కోలుకుంటాడని నేను భావించాను. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. నాకు ఏడుపు ఆగడం లేదు. ఎస్పీబీని ఈ పరిస్థితుల్లో చూసి తట్టుకోలేకపోతున్నా. నా చిరకాల మిత్రుడు గురించి నేను ఇంకేమి చెప్పలేను. 50 ఏళ్లకు పైగా ఎస్పీబీ పాటే ప్రపంచంగా గడిపారు. ఆయన ప్రపంచంలో అత్యంత గొప్ప గాయకుడు. వాటన్నింటికి మించి నాకు మంచి స్నేహితుడు. ఈ దుఃఖాన్ని ఎలా పంచుకోవాలో నాకు అర్థం కావడం లేదు. నాకు ఇంకాస్త నమ్మకం ఉంది. మానవుడు ఎంత గొప్పవాడైనా, అతడిని మించిన ఏదో ఒక శక్తి ఉంది. 50 ఏళ్లుగా రారా, పోరా అని ఒకరినొకరు పిలుచుకునేవాళ్లం ” అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు భారతీరాజా.

మరోవైపు ఎంజీఎం ఆసుపత్రి వద్ద పోలీసులు భారీగా చేరుకున్నారు. ఆసుపత్రి దగ్గరికి వచ్చే అభిమానుల సంఖ్య పెరుగుతుండటంతో పోలీసులు వారిని కంట్రోల్ చేస్తున్నారు. మరికాసేపట్లో తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి విజయ్ భాస్కర్ ఆసుపత్రికి రానుండగా.. ఆ తరువాత ప్రకటన విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.