మంచు విష్ణు, శ్రీనువైట్ల కలయికలో రూపొందిన బ్లాక్ బస్టర్ ఎంటర్ టైనర్ ‘ఢీ’. విష్ణు కెరీర్ లోనే టాప్ గ్రాస్ కలెక్షన్ చేసిన సినిమా ఇది. విష్ణు జోడీగా జెనీలియా, బ్రహ్మానందం, సునీల్ అంతా కలిసి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. దీంతో మంచు విష్ణు కెరీర్లో ఈ సినిమా ఓ మైలురాయిగా నిలిచింది. కాగా ఈ సినిమాకు సీక్వల్ రాబోతుందంటూ గత కొద్ది రోజులుగా వస్తున్న వార్తలను నిజం చేస్తూ ‘ఢీ’ సీక్వల్‌ని అఫీషియల్‌గా ప్రకటించారు డైరెక్టర్ శ్రీను వైట్ల. నేడు (నవంబర్ 23) విష్ణు పుట్టినరోజు కానుకగా తాజాగా ఈ మూవీ టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు.
కాస్త వెరైటీగా ‘డి & డి’ అని టైటిల్ కన్ఫర్మ్ చేసిన చిత్రయూనిట్ దీనికి ”డబుల్ డోస్” అనే ట్యాగ్ లైన్ పెట్టి అప్పటికంటే ఇంకా ఎక్కువ వినోదం పంచబోతున్నామని చెప్పకనే చెప్పింది చిత్రయూనిట్. 13 ఏళ్ల తర్వాత ఢీ సీక్వల్ అనౌన్స్ చేయడం విశేషం. టైటిల్ ను బట్టి .. ఇది ఇద్దరు క్రిమినల్స్ కు సంబంధించిన కథ అని అర్ధమవుతోంది. అలాగే ఆ ఇద్దరు ఛీటర్స్ అని తెలుస్తోంది. సరిగ్గా ఢీ సినిమాలో విష్ణు అదే పాత్రను పోషించిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో మంచు విష్ణుతో పాటు నటించబోయే మరో క్రిమినల్ ఎవరై ఉంటారు అనే క్యూరియాసిటీ ఉంది.
24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై మంచు అవరాం భక్త సమర్పణలో రూపొందనున్న ఈ సినిమాకు మంచు విష్ణు నిర్మాతగా వ్యవహరించనున్నారు. ప్రముఖ రచయిత కిషోర్ గోపుతో కలిసి గోపీమోహన్ స్క్రిప్ట్ అందిస్తున్నారు. యువ సంచలనం మహతి స్వరా సాగర్ సంగీతం అందిస్తున్నారు. మోహనా కృష్ణ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. చిత్రంలో నటించబోయే హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలు అతిత్వరలో ప్రకటించనుంది చిత్రయూనిట్.