When Thalapathy Vijay-Jr NTR had a chat over phone
When Thalapathy Vijay-Jr NTR had a chat over phone

కొద్దిరోజుల క్రితం ఏ మాత్రం పనీ పాటా లేని వ్యక్తులు యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాగా డ్యాన్స్ చేస్తాడా.. లేక ఇళయదళపతి విజయ్ బాగా డ్యాన్స్ చేస్తాడా అని ఓ పోల్ పెట్టి సోషల్ మీడియా తిట్టుకోవడం మొదలుపెట్టారు. కొందరేమో విజయ్ డ్యాన్స్ అద్భుతంగా చేస్తారు అని అంటే.. ఎన్టీఆర్ అభిమానులు ఊరికే ఉంటారా చెప్పండి..! తమ హీరోకు సంబంధించిన డ్యాన్స్ క్లిప్పింగ్ లు షేర్ చేశారు. విజయ్ ఫ్యాన్స్ కూడా ఆయన అద్భుతంగా చేసిన డ్యాన్స్ వీడియోలను పోస్టు చేస్తూ వచ్చారు. ఇక అక్కడితో ఆగకుండా పర్సనల్ గా దూషించుకునే దగ్గర వరకూ వెళ్ళింది. ఈ రచ్చ చాలా రోజులు సాగింది. ఇద్దరూ మంచి డ్యాన్సర్లే.. ఎందుకు ఈ గొడవ అని సర్ది చెప్పాలని మరికొందరు ప్రయత్నిస్తూ ఉన్నారు. పనీ పాటా లేని వాళ్ళే ఇలా అభిమానుల మధ్య గొడవలు పెడుతూ ఉన్నారని ఇంకొందరు తిడుతూ ఉన్నారు.

ఇలాంటి తరుణంలో ఓ వార్త ఇద్దరు అభిమానులను కాస్త కూల్ చేస్తోంది. అదేమిటంటే విజయ్ కు ఎన్టీఆర్ ఫోన్ చేసి మాట్లాడారన్నది..! విజయ్ కు తారక్ ఎందుకు ఫోన్ చేసి ఉంటారనే కదా మీ డౌట్..! ఏ సినిమా విజయం సాధించినా ఫోన్ చేసి అభినందనలు తెలపడంలో ఎన్టీఆర్ ఎప్పుడూ ముందు ఉంటారు. విజయ్ నటించిన ‘విజిల్’ చిత్రం తమిళనాట కలెక్షన్ల సునామీ సృష్టించిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాను చూసిన ఎన్టీఆర్, స్వయంగా ఫోన్ చేసి విజయ్ ని అభినందించారు.ఈ విషయాన్ని ఎన్టీఆర్ ప్రతినిధి కోనేరు మహేశ్, తన సోషల్ మీడియాలో వెల్లడించారు. తెలుగులో ‘విజిల్’ చిత్రాన్ని మహేష్ కోనేరు రిలీజ్ చేశారు. తెలుగులో కూడా మంచి కలెక్షన్లు సాధించి.. లాభాలను ఆర్జించింది సినిమా. తాజాగా చెన్నై వెళ్లిన మహేశ్, విజయ్ ని కలిసి ఆ ఫొటోను పోస్ట్ చేశారు. తన సినిమాలపై తెలుగు ప్రేక్షకులు చూపిస్తున్న అభిమానానికి విజయ్ ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారని, తన రాబోయే చిత్రాలు కూడా ప్రేక్షకులను రంజింపజేస్తాయన్న నమ్మకం ఉందని విజయ్ చెప్పారని మహేశ్ కోనేరు ఇద్దరు హీరోల మధ్య ఉన్న అనుబంధాన్ని గురించి క్లారిటీ ఇచ్చారు. కాబట్టి అభిమానులు చిల్లర గొడవలు సోషల్ మీడియాలో పెట్టుకోవడం మానేస్తే చాలా మంచిదనే విషయాన్ని గ్రహించాలి.