నాగార్జున నటించిన యాక్షన్ డ్రామా ‘వైల్డ్ డాగ్’ ట్రైలర్ విడుదలైంది. మెగాస్టార్ చిరంజీవి ఈ ట్రైలర్ ను సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు. హైదరాబాద్ గోకుల్ చాట్ లో జరిగిన బాంబు పేలుడు తో మొదలైన ఈ ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది.
హైదరాబాద్ లోనే తిష్టవేసిన టెర్రరిస్టులు, వాళ్ళ ఆచూకి తెలుసుకోవడానికి ప్రయత్నించే ఎన్.ఐ.ఎ. అధికారులు… తన సహనానికి పరీక్ష పెడితే… మరో ఆలోచన లేకుండా టెర్రరిస్టులను కాల్చి చంపేసే ఎసీపీ విజయ్ వర్మ… వీళ్ళతో అత్యంత ఆసక్తికరంగా ‘వైల్డ్ డాగ్’ ట్రైలర్ రూపుదిద్దుకుంది. హైదరాబాద్ నుండి కాశ్మీర్ కు కథ వెళ్ళాక అక్కడి యాక్షన్ సన్నివేశాలు మరింత రక్తి కట్టించాయనే చెప్పాలి. నాగార్జునకు జోడీగా దియా మీర్జా నటించగా, సాయామీ ఖేర్ ఓ కీలక పాత్రను పోషించింది.
అహిషోర్ సాల్మన్ దర్శకత్వంలో నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ట్రైలర్ తో భారీ అంచనాలు నెలకొన్న ‘వైల్డ్ డాగ్’ మూవీ ఏప్రిల్ 2న విడుదల కాబోతోంది. విశేషం ఏమంటే… ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన నిరంజన్ రెడ్డి గతంలో ‘క్షణం, ఘాజీ’ చిత్రాలకు నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. అలానే ఇప్పుడు చిరంజీవి ‘ఆచార్య’ చిత్రాన్ని రామ్ చరణ్ తో కలిసి నిర్మిస్తున్నారు.