సూపర్‌స్టార్ మహేష్ బాబు,(Mahesh Babu) గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా జోనస్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం వారణాసి (Varanasi) పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమా సాధారణ కమర్షియల్ మూవీకి భిన్నంగా భారీ స్థాయిలో రూపొందుతోంది. ముఖ్యంగా టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో పాటు రామాయణానికి సంబంధించిన అంశాలను కథలో భాగంగా తీసుకోవడం సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది.
‘వారణాసి’ని కేవలం తెలుగు ప్రేక్షకులకు మాత్రమే పరిమితం చేయకుండా అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్లాలన్నది రాజమౌళి లక్ష్యంగా కనిపిస్తోంది. ముఖ్యంగా హాలీవుడ్ మార్కెట్లో సినిమాకు భారీగా గుర్తింపు తీసుకురావడానికి ఆయన అంతర్జాతీయ మీడియాతో వరుసగా ఇంటర్వ్యూలు, పాడ్‌కాస్ట్‌లు చేస్తూ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడిస్తున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా ‘వారణాసి’ కథలో రామాయణం ఎలా ఉంటుంది? అనే విషయంపై రాజమౌళి ఆసక్తికరమైన క్లారిటీ ఇచ్చారు.
సినిమాలో మహేష్ బాబు ‘రుద్ర’ అనే సాధారణ వ్యక్తి పాత్రలో కనిపించనున్నాడు. అయితే కథలో కీలకమైన మలుపుగా టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ వస్తుంది. రుద్ర కాలంలో వెనక్కి ప్రయాణించి రామాయణ కాలానికి చేరుకుంటాడు. అక్కడ మహేష్ బాబు శ్రీరాముడి పాత్రలో కూడా కనిపించనున్నాడు. దీంతో మహేష్ బాబు అభిమానులతో పాటు రామాయణ నేపథ్యాన్ని ఇష్టపడే ప్రేక్షకుల్లో కూడా ఈ సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది.
అయితే సినిమాలో రామాయణానికి సంబంధించిన భాగాన్ని ఒకే సారి వచ్చే భారీ ఎపిసోడ్‌గా చూపించబోవడం లేదని రాజమౌళి వెల్లడించారు. గతంలో ‘మగధీర’ సినిమాలో కనిపించిన చారిత్రక భాగాలు లేదా ‘బాహుబలి’ చిత్రాల్లో వచ్చిన సుదీర్ఘ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ల మాదిరిగా ‘వారణాసి’లో రామాయణ యుద్ధాన్ని ఒకే బ్లాక్‌గా చూపించబోరట.
దానికి బదులుగా రామాయణానికి సంబంధించిన వివిధ అంశాలను చిన్న చిన్న సబ్-ప్లాట్స్‌గా విభజించి, ప్రధాన కథలో అవసరమైన సందర్భాల్లో వాటిని కలుపుతూ కథను ముందుకు తీసుకెళ్లనున్నారని తెలుస్తోంది. అంటే సినిమా కథ ఎక్కడికి వెళ్తుందో, ఏ సందర్భంలో ఏ అంశం అవసరమో దానికి అనుగుణంగా రామాయణంలోని ఎపిసోడ్స్ ప్రేక్షకుల ముందుకు వస్తాయన్నమాట.
ఈ విధానం ‘వారణాసి’ కథనానికి చాలా కీలకంగా మారే అవకాశం ఉంది. రామాయణం కోసం ప్రత్యేకంగా ఒక భారీ ఎపిసోడ్‌ను ఏర్పాటు చేయకుండా, ప్రధాన కథతో పాటు రామాయణ అంశాలు సమాంతరంగా ప్రయాణించేలా రాజమౌళి స్క్రీన్‌ప్లేను రూపొందిస్తున్నట్లు అర్థమవుతోంది.
మహేష్ బాబు పోషిస్తున్న రుద్ర పాత్రకు రామాయణ కాలంతో ఏర్పడే సంబంధం సినిమా కథలో ఎలాంటి ప్రభావం చూపుతుంది? రుద్ర ప్రయాణం చివరకు ఎలా మారుతుంది? శ్రీరాముడిగా మహేష్ బాబు కనిపించే సన్నివేశాలు కథలో ఎక్కడ, ఏ సందర్భంలో వస్తాయి? అనే ప్రశ్నలకు సినిమా విడుదలైన తర్వాతే పూర్తి సమాధానం దొరకనుంది.
ప్రస్తుతం మాత్రం రాజమౌళి ఇస్తున్న ప్రతి చిన్న అప్డేట్ ‘వారణాసి’పై అంచనాలను మరింత పెంచుతోంది. టైమ్ ట్రావెల్, అడ్వెంచర్, రామాయణం, మహేష్ బాబు పాత్ర, భారీ విజువల్స్ వంటి అంశాల కలయికతో ఈ సినిమా భారతీయ సినిమా స్థాయిని మరోసారి అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నంగా కనిపిస్తోంది.