ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో థియేటర్ల సమస్య నిన్న మొన్నటిది కాదు, ఎప్పటినుంచో వస్తున్నదే. ఇటీవల రామ్ చరణ్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం ‘పెద్ది’ కూడా ఈ సమస్యను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ సమయంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌కి చెందిన నిర్మాతలలో ఒకరైన శిరీష్ మాట్లాడుతూ… తాము థియేటర్ల టికెట్ రేట్లు పెంచమని, ప్రభుత్వం జీవో ఇచ్చినా సరే రెగ్యులర్ రేట్లకే సినిమాలు ఆడిస్తామని వెల్లడించారు.

అయితే, కేజీఎఫ్ సిరీస్ తర్వాత యష్ నటించిన ‘టాక్సిక్’ (TOXIC) సినిమాకు సంబంధించి ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు 10 రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతిస్తూ జీవోలు విడుదల చేశాయి.

తెలంగాణలో  ఆగస్టు 26 నుండి సెప్టెంబర్ 4 వరకు (10 రోజుల పాటు) రోజుకు 5 రెగ్యులర్ షోలకు గానూ సింగిల్ స్క్రీన్స్ పై రూ. 50, మల్టీప్లెక్స్/స్పెషల్ థియేటర్లలో రూ. 100 అదనంగా వసూలు చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతినిచ్చింది.

ఏపీ ప్రభుత్వం ప్రీమియర్ షో టికెట్ ధరను రూ. 600గా నిర్ణయించింది. ఆ తర్వాత 10 రోజుల పాటు రెగ్యులర్ షోలకు గానూ సింగిల్ స్క్రీన్స్ పై రూ. 50, మల్టీప్లెక్స్ లలో రూ. 100 చొప్పున పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది.

అయితే, ఈ జీవో ప్రకారం నిర్మాతలు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ ఫండ్‌కు రూ. 1 కోటి చెల్లించాల్సి ఉంటుంది.

ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ ‘టాక్సిక్’ సినిమా హక్కులను దిల్ రాజు మరియు శిరీష్ కాంబినేషన్ దక్కించుకొని విడుదల చేస్తున్నారు. దాంతో ‘పెద్ది’ సినిమా రిలీజ్ సమయంలో శిరీష్ చెప్పిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఈ విషయంపై శిరీష్ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి. ప్రతిసారీ ఒక మెగా సినిమా రిలీజ్ అవుతుందంటే థియేటర్ల సమస్యను తెరపైకి తెస్తున్నారు, మరి అదే సమస్య ఈ డబ్బింగ్ సినిమాలకు ఎలా వర్తిస్తుందో చూడాల్సి ఉంది.