Prabhas Upcoming Movies Shooting Updates: ప్రభాస్ క్యాలెండర్ ప్రస్తుతం ఫుల్ బిజీగా మారింది. ప్రస్తుతం ఫౌజీ షూటింగ్‌తో బిజీగా ఉన్న ప్రభాస్.. అక్టోబర్‌లో కల్కి 2 రెగ్యులర్ షూటింగ్‌లోకి అడుగుపెట్టనున్నారు. మరోవైపు స్పిరిట్ సినిమాకు ఇంకా భారీ షూటింగ్ షెడ్యూల్ మిగిలి ఉంది. దీంతో ప్రభాస్ మూడు భారీ చిత్రాలను వేర్వేరు దశల్లో ముందుకు తీసుకెళ్తున్నారు.
ప్రస్తుతం ప్రభాస్ ఫోకస్ మొత్తం హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియడ్ యాక్షన్ డ్రామా ఫౌజీ (Fauzi) పైనే ఉంది. ప్రభాస్ ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. అయితే గతంలో ప్రకటించిన డిసెంబర్ 3 విడుదల తేదీని మేకర్స్ తాజాగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే. కొత్త విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేసేందుకు అదనపు సమయాన్ని ఉపయోగించుకుంటున్నారు. అయితే ట్రేడ్ వర్గాల నుండి వెళ్తున్న సమాచారం మేరకు ఈ సినిమాని జనవరి 26 గాని లేదంటే ఫిబ్రవరిలో కానీ రిలీజ్ చేయటానికి మేకర్స్ సన్నహాలు చేస్తున్నట్టు సమాచారం.
ఇక అక్టోబర్ నుంచి ప్రభాస్ మరో కీలకమైన ప్రాజెక్ట్‌లోకి అడుగుపెట్టనున్నారు. నాగ్ అశ్విన్ కల్కి 2 (Kalki 2 Shooting) రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్‌లో ప్రారంభమవుతుందని రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో దర్శకుడు వెల్లడించడం జరిగింది. దీంతో ఈ సీక్వెల్ నిర్మాణ దశ అధికారికంగా మొదలుకానుంది. ఈ సినిమా షూటింగ్ 2027లో కూడా కొనసాగనున్న నేపథ్యంలో ప్రభాస్ షెడ్యూల్‌లో దీనికి గణనీయమైన సమయం కేటాయించాల్సి ఉంటుంది.
మరోవైపు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పిరిట్ (Spirit) కూడా కీలక దశలో ఉంది. ఇప్పటికే 40 రోజుల షూటింగ్ పూర్తయిందని సందీప్ రెడ్డి వంగా వెల్లడించారు. ఇంకా 65 వర్కింగ్ డేస్ షూటింగ్ చేయాల్సి ఉందని తెలిపారు. ఈ సినిమాను 2027 మార్చి 5న విడుదల చేయాలని టార్గెట్ చేస్తున్నారు. దీంతో మరో భారీ షూటింగ్ షెడ్యూల్ ప్రభాస్ ముందుంది.
ఇలా చూస్తే ప్రభాస్ క్యాలెండర్ మరింత ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఒక సినిమా షూటింగ్ జరుగుతుండగా, మరో సినిమా రెగ్యులర్ ప్రొడక్షన్‌లోకి అడుగుపెట్టబోతోంది. ఇంకో సినిమాకు 65 వర్కింగ్ డేస్ షూటింగ్ ఇంకా పూర్తి చేయాల్సి ఉంది.
ఈ మూడు సినిమాల తర్వాత ప్రభాస్ అలాగే రాజమౌళి మళ్లీ కలిసి బాహుబలి 3 తీసే అవకాశాలు ఉన్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది అయితే మొన్న రిలీజ్ అయిన వీడియోలో కూడా బాహుబలి 3 ఉంటుందని మేకర్స్ చెప్పకనే చెప్పారు